
- యాక్సిడెంటల్ డెత్ ఎక్స్‌గ్రేషియా రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు..
- సహజ మరణానికి రూ. 1.30 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచిన ప్రభుత్వం
- హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు
కరీంనగర్, వెలుగు : భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా యాక్సిడెంటల్ డెత్ ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాలని గత సర్కార్ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 15.07 లక్షల మందికి..
రాష్ట్రంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద 28,68,046 మంది కార్మికులు రిజిష్టర్ అయి ఉండగా.. ఇందులో 60 ఏండ్ల లోపు ఉన్న వారు 15,04,765 మంది ఉన్నారు. మొత్తం కార్మికుల్లో 16.42 లక్షల మంది కూలీలు ఉండగా, తాపీమేస్త్రీలు 2,96,153 మంది, ఎలక్ట్రీషియన్లు 1,04,047, హెల్పర్లు 2,06,732, పెయింటర్లు 78,209, సోలార్ ఫెన్సింగ్ వర్కర్లు 57,134, కార్పెంటర్లు 45,307, సెంట్రింగ్ కార్మికులు 41,444 మంది ఉన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మన్లు, టన్నెల్‌వర్కర్స్, బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్ వర్కర్లు, రాళ్లు కొట్టేవాళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్ డ్రైనేజీ వర్కర్స్, మిక్సర్ డ్రైవర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్ వర్కర్స్ తదితర 54 రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో 60 ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగిన వారందరికీ ఈ బీమా వర్తించనుంది.
నిర్మాణ రంగ కార్మికుల కోసం అనేక స్కీమ్‌లు
భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేసే 54 విభాగాల కార్మికుల కోసం రాష్ట్ర కార్మిక శాఖ పలు పథకాలను అమలు చేస్తోంది. పని ప్రదేశాల్లో ప్రమాదశాత్తు చనిపోయే కార్మికులకు యాక్సిడెంటల్ డెత్ కింద రూ. 6 లక్షలతో పాటు దహనసంస్కారాల కోసం రూ. 30 వేలు ఇచ్చేవారు. ఈ ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. అలాగే సహజంగా మరణిస్తే దహన సంస్కారాలకు రూ. 30 వేలతో పాటు బాధిత కుటుంబానికి రూ.లక్ష సాయం అందజేసేవారు. ఈ సాయాన్ని ప్రస్తుతం రూ. 2 లక్షలకు పెంచారు.
వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ.30 వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ.30 వేలు, ప్రమాదవశాత్తు గాయపడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ.4 లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ.5 లక్షలు అందజేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంటల్ డెత్, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు వంగూరు రాములు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఎక్స్‌గ్రేషియాను పెంచడం ఆనందంగా ఉందన్నారు.
రిజిస్ట్రేషన్‌కు అర్హతలివే..
తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద సభ్యులుగా 18 ఏండ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు. వీరు ఏడాదిలో కనీసం 90 రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, వయస్సు నిర్ధారణకు రుజువుగా స్కూల్ సర్టిఫికేట్ లేదా డాక్టర్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. మెంబర్ షిప్ ఫీజు కింద రూ. 50, ఐదేండ్ల రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 60 కలిపి- సంబంధిత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌కు అందజేసి లేబర్ కార్డును పొందొచ్చు. ఐదేండ్ల తర్వాత మరో రూ.60 చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలి.