డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఆకునూరి ఆందోళన

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఆకునూరి ఆందోళన
  • పేదలతో కలిసి భూపాలపల్లిలో కట్టిన ఇండ్లలోకి..
  • అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ లో నిరసన
  • 4రోజుల్లో లబ్ధిదారుల లిస్టు ఇస్తామన్న ఆఫీసర్లు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆందోళన చేపట్టారు. పేదలతో కలిసి భూపాలపల్లి టౌన్ లోని వేశాలపల్లిలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వెంటనే అక్కడికెళ్లి ఇండ్లను ఖాళీ చేయించారు. మురళిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో సోమవారం భూపాలపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 3,882 డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా 2,511 ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టారు. వీటిలో దాదాపు 1,100 ఇండ్లు పూర్తయ్యాయి. ఇవన్నీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాయి. ఇదే జిల్లాలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పని చేసిన మురళి.. తాను ఉన్నప్పుడు పనులు స్పీడ్ గా చేయించారు. కానీ ఇండ్లు కట్టుడు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఆఫీసర్లు పేదలకు కేటాయించడం లేదు. దీంతో 20 రోజుల కింద పేదలతో కలిసి వచ్చిన మురళి.. ఇండ్లు పంపిణీ చేయాలని కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో వినతిపత్రం ఇచ్చారు. కానీ ఆఫీసర్లు పేదలకు ఇండ్లు కేటాయించలేదు. దీంతో పేదలతో కలిసి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు వేశాలపల్లిలో నిర్మించిన 544 డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్ ఇండ్ల వద్దకు మురళి వెళ్లారు. 

స్టేష‌‌‌‌న్ లో దీక్ష... 

పోలీసులు మురళిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించగా.. ఆయన అక్కడే చెట్టు కింద కూర్చొని దీక్ష చేపట్టారు. వందలాది మంది పేదలు అక్కడికి చేరుకోగా, దాదాపు 5 గంటల పాటు మురళి నిరసన కొనసాగించారు. 24 గంటల్లో ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పారు.ఎమ్మార్వో ఇక్బాల్ అక్కడికి వెళ్లి, వచ్చే నెల 10లోగా ఇండ్ల కేటాయింపు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ మురళి అందుకు ఒప్పుకోలేదు. చివరకు 4 రోజుల్లో లబ్ధిదారుల లిస్టు రెడీ చేసి, ఇండ్లు పంపిణీ చేస్తామని ఆఫీసర్లు చెప్పడంతో దీక్ష విరమించి వెళ్లిపోయారు.