ఎర్రబెల్లి సీక్రెట్‍ మీటింగ్‍.. కాంగ్రెస్లోకి వెళ్తారంటూ ప్రచారం

ఎర్రబెల్లి సీక్రెట్‍ మీటింగ్‍.. కాంగ్రెస్లోకి వెళ్తారంటూ ప్రచారం

 

  • ముఖ్య అనుచరులతో సొంతూరు పర్వతగిరిలో భేటీ
  • కాంగ్రెస్‍ పార్టీలో చేరుతాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం 
  • సన్నిహితులు, ముఖ్యనేతల ఫీడ్‍ బ్యాక్‍ తీసుకున్నారనే చర్చ

 
వరంగల్‍/పర్వతగిరి, వెలుగు: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తన ముఖ్య నేతలతో సీక్రెట్‍ మీటింగ్‍ పెట్టారు. ఇన్నాళ్లు ఆయన ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన దగ్గరి కార్యకర్తలతో.. సొంతూరు పర్వతగిరిలోని తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్‍ హెడ్‍ క్వార్టర్స్​తో పాటు లోకల్‍ నుంచి వెళ్లిన మీడియాను సైతం మీటింగ్‍ కు అనుమతించలేదు. కొన్ని రోజులుగా ఎర్రబెల్లి పార్టీ మారుతున్నాడని.. కాంగ్రెస్‍ పార్టీలో చేరేలా పాత టీడీపీ బ్యాచ్‍తో సంప్రదింపులు జరుపుతున్నాడని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరగా సలహాలిస్తూ ఉమ్మడి వరంగల్‍ జిల్లా నుంచి కీలకంగా ఉన్న ఓ మాజీ సీనియర్‍ టీడీపీ నేతతో భేటీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‍రావు నియోజకవర్గ ముఖ్య కేడర్​తో సమావేశమవడం చర్చనీయాంశమైంది. తనకు పార్టీ మారే ఆలోచన లేదంటూనే.. లీడర్ల ఫీడ్‍ బ్యాక్‍ తీసుకోడానికే ఎర్రబెల్లి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని తెలుస్తున్నది. అయితే రాజకీయంగా యాక్టివ్‍గా ఉండాలని వారు ఎర్రబెల్లిని కోరినట్లు తెలుస్తున్నది. ఏ నిర్ణయం తీసుకున్నా గతంలో మాదిరి వెంట నడుస్తామని చెప్పినట్లు సమాచారం. పార్టీ మార్పు ప్రచారం జోరుగా నడుస్తున్న సమయంలో విదేశాల నుంచి వచ్చిన మంత్రి దానిని ఖండించకుండా.. సీక్రెట్‍ మీటింగ్‍ పెట్టడంపై ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో జోరుగా చర్చ నడుస్తున్నది. గతంలోను పార్టీ మారే క్రమంలో ఇదే విధంగా వ్యవహరించారాని ఆయన్ను దగ్గరగా గమనించిన వాళ్లు అంటున్నారు.