నేను ఒళ్లు వంచి పనిచేయందే పదవులిచ్చారా కొడుకా

నేను ఒళ్లు వంచి పనిచేయందే పదవులిచ్చారా కొడుకా
  • సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్

కరీంనగర్: ఒక్క సెంటు భూమి నా దగ్గర అక్రమంగా ఉంటే నేను నేలకు ముక్కు రాస్తానని చెప్పాను... మరి సీఎం కేసీఆర్ రాస్తాడా..? అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ చేశారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల ఉద్వేగంగా మాట్లాడారు. 20 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల కుటుంబాల్లో ఒకడిగా ఉన్నా. కాలిలో ముల్లు ఇరిగితే నోటితో తీసినవాణ్ని, పార్టీతో, జెండాతో సంబంధం లేకుండా నేను ప్రజలతో మమేకమయ్యానని గుర్తు చేసుకున్నారు. ‘‘కోర్టులో విడాకులు తీసుకున్న భార్యాభర్తలు పిల్లలను పంచుకోవాల్సివచ్చినట్లుగా మా కార్యకర్తలను, నాయకులను విడదీసారు. మా నాయకులను విడదీయడం నాకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇంటింటికి తిరిగి ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధులను నేను గెలిపిస్తే ఇప్పుడు కొందరు నాపై వ్యతిరేకంగా ట్లాడుతున్నారు. నేను ద్రోహం చేసానని ఓ జెడ్పీటీసీ మాట్లాడుతున్నారు. వాళ్లను గెలిపించడానికి బయటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏనాడైనా వచ్చారా ? నేను టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి భూములు పంచాయతీ అని ప్రచారం చేస్తున్నారు. ఒక్క సెంటు భూమి నా దగ్గర అక్రమంగా ఉంటే నేను నేలకు ముక్కు రాస్తానని చెప్పాను... మరి సీఎం రాస్తాడా ? పేదల చదువులకు, పెళ్లిళ్లకు సాయం చేసాను తప్ప.. ఏనాడు ఐదు పైసలకు చేయి చాచలేదు. ఏ తప్పు చేయని నాలాంటి వానిమీద చిల్లరమల్లర ప్రచారం చేస్తున్నారు.. ’’ అని మాజీ మంత్రి ఈటల అన్నారు.
కేసీఆర్ దుర్మార్గాలకు గోరీ కట్టే సమయం ఆసన్నమైంది
కేసీఆర్ అహంకారానికి, అబద్ధాలకోరుతనానికి, దుర్మార్గాలకు ఘోరీ కట్టే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు, బాధపడకు, నీ చిరునవ్వు చెరగనీయొద్దని ధైర్యం చెబుతున్నారని తెలిపారు. నేను మంత్రి పదవికి, పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, నన్ను వాళ్లే తొలగించారని, అనామకులతో ఫిర్యాదు చేయంచుకుని అర్ధగంటలో నా పదవి తీసేసారని ఆరోపించారు. ‘‘ఎవరైనా ఫిర్యాదు చేస్తే పిలిచి అడగడటం సంస్కృతి. కానీ నన్ను పిలువలేదు. గొర్రెల మంద మీద తోడేళ్లు పడినట్లుగా నాపై ఒక్కరోజులోనే ఆరోపణలు చేసి పదవి తీసేసారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని నా అభిమానులు, ప్రజలు చెప్పారు. ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన వాళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పుడు మీరెందుకు చేయాలని ప్రజలు అడిగారు. కానీ దమ్ము, ధైర్యం, విశ్వాసం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని వాళ్లు నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. నాకు ఇజ్జత్ ఉంది కాబట్టి ప్రజలపై విశ్వాసంతో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను..’’ అని ఈటల తెలిపారు. 
నా రాజీనామా అర్దగంటలో ఆమోదించారు
‘‘ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే, నిజమా, కాదా అని తెలుసుకునంటారు.  ఎందుకు చేసావని క్లారిటీ తీసుకుంటారు. కానీ నేను రాజీనామా చేసేందుకు వెళితే స్పీకర్ కూడా రాలేదు. నేనే వెళ్లి అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా ఇచ్చి వచ్చా. నేను రాజీనామా చేసిన అర్ధగంటకే ఆమోదించినట్లుగా గెజిట్ ఇచ్చారు. నాలాంటోడు అసెంబ్లీలో అడుగపెట్టవద్దని అలా చేసారు. నేను అసెంబ్లీలో అడుగు పెడితే ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తానని వెంటనే రాజీనామా ఆమోదించారు. నేను బీజేపీలో చేరి మీ దగ్గరకి వచ్చాను.  పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నా.. మీ బిడ్డగా గతంలో ఎలా ఉన్నానో, అలాగే ఉంటా. అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా హుజురాబాద్ ను అభివృద్ధి చేశా..’’ అని ఈటల వివరించారు. ఇక్కడి ప్రజలు పైసలకు ఆశపడేవారు కాదని, ఈ గెలుపు హుజురాబాద్ ప్రజల గెలుపు కాదు... యావత్ తెలంగాణ ప్రజల గెలుపు కావాలని ఆయన కోరారు. 
ఓటుకు పదివేలు ఇచ్చినా టక్కు టమారాలు హుజూరాబాద్ లో చెల్లవు
అవతలి పార్టీ వాళ్లు ఓటుకు పదివేలు ఇస్తారు, వాళ్లకు మనుషులు మీదకంటే డబ్బులపైనే నమ్మకం ఎక్కువ, వాళ్ల టక్కు టమారా విద్యలు ఇక్కడ చెల్లవని నిరూపించాల్సిన అవసరం వచ్చిందని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్లను ఈ ఎన్నిక నిరూపించాలి, నేను ఈసారి ఇంటింటికి వస్తా.. మీరే మా నాయకులుగా ఉండాలి.. విద్యార్థులే ఎక్కడికక్కడ కథానాయకులై నిలవాలి.. నాకు పదవులిచ్చానని చెప్పుకుంటున్నారు.. నేను ఒళ్లు వంచి పనిచేయందే ఇచ్చారా కొడుకా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏం తిన్నామో, ఎక్కడ పన్నామో తెలియకుండా ఉద్యమంలో పనిచేశాం, ఇది నీ సొంత పార్టీలాగా భావించి, గడ్డిపోచలాగా తీసేస్తామంటే పోతామనుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించండి. మిమ్మల్ని మీరు గెలిపించుకోండి..’’ అని ఈటల కోరారు.