
హైదరాబాద్: ‘అప్పుల లెక్కలు ఇప్పుడు తెలుస్తున్నాయా.. డిస్కం లు, జెన్ కో తెచ్చిన అప్పులను ప్రతి సంవత్సరం అసెంబ్లీలో వివరించాం.. 24 గంటల్లో రూ.2 లక్షల రుణమాఫీ అని రాహుల్ గాంధీ అన్నారు.. ఏడ పోయుండు.. అన్యాయంగా హామీలిచ్చి ఇప్పుడు తప్పును మాపై మోపే ప్రయత్నం చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్య కే తారకరామారావు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. అప్పులపై శ్వేత పత్రం ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాము చేసిన అప్పులన్నీ అసెంబ్లీలోనే చెప్పామన్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క ప్రశ్నిస్తే సమాధానం సైతం చెప్పామని అన్నారు.
అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ్రని చెప్పిస్తారని అన్నారు. రూ. లక్ష రుణమాఫీ కోసం తాము మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసిన రీసోర్స్ మొబిలైజేషన్ కోసం తంటాలు పడ్డామని గుర్తు చేశారు. అలాంటిది వాళ్లు వన్ స్ట్రోక్ లో రూ. 2 లక్షల రుణ మాఫీ అన్నారని, ఎట్లా చేస్తారో చూద్దామని అన్నారు. ఒకాయన సెగ్మెంట్ లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.. ఎలా ఇస్తారో చూద్దామని కేటీఆర్ అన్నారు.
మొన్నటి దాకా తాము అధికారంలో ఉన్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో తమకు తెలుసునని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చేందుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు మా చేతిలో ఏమీ లేదంటే కుదరదని, తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ అన్నారు.