రాజయ్య ఒంటరి .. కాంగ్రెస్​లోకి నో ఎంట్రీ

రాజయ్య ఒంటరి .. కాంగ్రెస్​లోకి నో ఎంట్రీ
  • వాపస్​కు బీఆర్​ఎస్​లో డోర్లు క్లోజ్​ 
  • నిరాశలో తాటికొండ అనుచరులు

జనగామ, వెలుగు: స్టేషన్ ఘన్​పూర్​మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒంటరయ్యారు. బీఆర్ఎస్​లో తనకు గుర్తింపు లేదంటూ కారు దిగిన ఆయనకు కాంగ్రెస్​లో దారులు మూసుకపోయాయి. దీంతో రాజయ్య ఆయన అనుచరులు అయోమయంలో పడిపోయారు. స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే, తన చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరితో వేగలేక రెండు నెలల క్రితం ఫిబ్రవరి 3న రాజయ్య బీఆర్​ఎస్​కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై పలు ఆరోపణలు చేశారు. ఆత్మాభిమానం చంపుకోలేక పార్టీని వీడినట్లు భావోద్వేగంతో చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్​ లో చేరేందుకు రాజయ్య చేయని ప్రయత్నం లేదు. రాష్ట్రంలోని మంత్రులు మొదలుకొని సీఎం రేవంత్​ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వరకు అందరినీ పలుమార్లు కలిశారు. వరంగల్​ ఎంపీ టికెట్​ లక్ష్యంగా పావులు కదిపారు. టికెట్​ సంగతి దేవుడెరుగు కనీసం పార్టీలో చేర్చుకునేందుకు కూడా కాంగ్రెస్​ గ్రీన్​సిగ్నల్​ఇవ్వలేదు. బీఆర్​ఎస్​ కు రాజీనామా చేసి రెండు నెలలైనా ఏ పార్టీలో చేరలేదు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎంగానూ పనిచేసిన రాజయ్య ముందస్తు ప్లాన్​, పక్కా హామీ లాంటివి లేకుండా ఓవర్​ కాన్ఫిడెన్స్​తో బీఆర్​ఎస్​ కు బై బై చెప్పి ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పల్లా చివరి ప్రయత్నం..

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డికి తాటికొండ రాజయ్యకు మధ్య ఉన్న సాన్నిహిత్యం తో ఆయన్ని తిరిగి గులాబీ గూటికి తీసుకు వచ్చేందుకు పల్లా చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అటు మాజీ మంత్రి హరీశ్​రావు సైతం స్టేషన్​ ఘన్​పూర్ నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నేతలతో ఇటీవల మాట్లాడారు. రాజయ్యను తిరిగి పార్టీలోకి తెస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలను సేకరించినట్లు క్యాడర్​ చెబుతోంది. ఈ క్రమంలో రాజయ్య రీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్​ చేస్తున్న వ్యాఖ్యలతో రాజయ్యకు సంకట స్థితి నెలకొంది. ఇన్నాళ్లు స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ నుంచి రాజయ్య, టీడీపీ నుంచి కడియం శ్రీహరి ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండేవారు. తెలంగాణ ఉద్యమ టైంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​ గూటికి చేరారు. అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత కడియం శ్రీహరి కూడా గులాబీ గూటికి చేరగా ఈ ఇద్దరి మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉండేది. వరుసగా నాలుగు సార్లు రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, కడియం శ్రీహరి నుంచి ఇంటిపోరు ఎదుర్కొన్నారు. కేసీఆర్​ తొలి కేబినెట్​లో రాజయ్య డిప్యూటీ సీఎం కాగా ఆ పదవి ఆర్నెళ్లకే పోయింది. అదే పదవి కడియంకు దక్కింది. ఇప్పుడు గులాబీ పార్టీని వదిలి కడియం బాధ తప్పించుకుందామని బయటకు వస్తే తిరిగి అదే కడియం రూపంలో అడ్డంకులు కలుగుతున్నాయి. కాంగ్రెస్​ ఎంపీ టికెట్​ కోసం ప్రయత్నిస్తే ఈయన్ని కాదని కాంగ్రెస్​ పార్టీ కడియం కూతురు కావ్యకు టికెట్​ ఇవ్వడం రాజయ్యకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నేటికీ కడియం రూపంలో రాజయ్యకు రాజకీయ గ్రహణం వీడడం లేదనే చర్చ జరుగుతోంది. 

బీఆర్​ఎస్​ డోర్లు క్లోజ్​

స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన భారీ షాక్​ నుంచి బీఆర్​ఎస్​ తేరుకోలేక పోతోంది. గెలుపోటములు ఎలా ఉన్నా పార్టీ మారినోళ్లను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ పదే పదే చెప్తున్నారు. కాళ్లు మొక్కినా తిరిగి రానియ్యమని, కొత్తనాయకులను తయారుచేస్తామని క్యాడర్​ కు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కడియం తన కూతురు కావ్యతో కలిసి బీఆర్​ఎస్ కు గుడ్​ బై చెప్పిన రోజు తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్​ఎస్​ లో చేరుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ కేటీఆర్​ మాటలు రాజయ్యను, ఆయన అనుచరులను డైలమాలో పడేస్తున్నాయి. బీఆర్​ఎస్​ లో రీ ఎంట్రీకి డోర్లు క్లోజ్​ అయినట్లేనని భావిస్తున్నారు.