త్వరలోనే సీఎం రేవంత్ గుడ్​ న్యూస్ చెప్తారు: చల్లా వంశీచంద్ రెడ్డి

త్వరలోనే సీఎం రేవంత్ గుడ్​ న్యూస్ చెప్తారు: చల్లా వంశీచంద్ రెడ్డి

మహబూబ్​నగర్/మాగనూరు, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ‘కొడంగల్-– నారాయణపేట’ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమును పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి చెప్పారు. ‘పాలమూరు పునర్జీవం’ పేరుతో వంశీచంద్ బుధవారం ‘పాలమూరు న్యాయ్​యాత్ర’ను ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేసి యాత్రను మొదలుపెట్టారు.

మొదటిరోజు కృష్ణ, హిందుపూర్, కున్సీ, కొత్తపల్లి, మాగనూరు, వర్కూరు, నేరుడుగాం గ్రామాల్లో యాత్ర కొనసాగింది. హిందుపూర్, కొత్తపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్ లో వంశీ చంద్​మాట్లాడారు. ‘గత పాలకులు పాలమూరు జిల్లాను దోచుకుతిన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లా బిడ్డనే కావడంతో ఇప్పుడు అభివృద్ధి చేసుకునే టైం వచ్చింది.

కొడంగల్- నారాయణపేట లిఫ్ట్​ఇరిగేషన్​స్కీమును పట్టాలెక్కిస్తాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ ఆఫీసర్లతో చర్చించారు. త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు గుడ్​న్యూస్​చెబుతారు.’ అని వంశీ చెప్పారు. బీఆర్ఎస్​నేతలు పదేండ్లలో ఏనాడూ పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం రేవంత్​సహకారంతో, రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ స్ఫూర్తితోనే యాత్ర చేపట్టానన్నారు. సంగంబండ రిజర్వాయర్ నిర్వాసితులకు పెండింగ్​ పరిహారాన్ని త్వరలోనే ఇప్పిస్తామన్నారు. యాత్రలో మక్తల్, దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్ రెడ్డి, చిట్టెం పర్నికారెడ్డి, నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ వనజ తదితరులు పాల్గొన్నారు.