వారిద్దరిని సీఎం కేసీఆర్ సస్పెండ్ చేయాలి: దత్తాత్రేయ

వారిద్దరిని సీఎం కేసీఆర్ సస్పెండ్ చేయాలి: దత్తాత్రేయ

ఇంటర్ పరీక్షల్లో మూడు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడం తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేదని ఆయన అన్నారు. హన్మకొండలోని బీజేపీ కార్యాలయంలో దత్తాత్రేయ మాట్లాడుతూ..  నైపుణ్యం, అనుభవం, సాంకేతికత లేని సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడమే ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణమన్నారు.

సిట్టింగ్ హై కోర్ట్ జడ్జిచే ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించి, దీనంతటికి కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ ను సస్పెండ్ చేయించాలని  సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అన్నారు. న్యాయం కోసం నిరసనలు చేస్తే అరెస్ట్ లతో అణిచివేస్తున్నారని, రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుందని దత్తాత్రేయ అన్నారు. విద్యార్థులు కూడా చదువు కోసం ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకోకూడదని ఆయన అన్నారు.