ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ బీసీ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ మచ్ఛేందర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్‌లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీఎం నాయకులు శ్రీధర్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్, యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు.
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రశ్నించే విద్యార్థి సంఘం నాయకులపై వార్డెన్ దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండతో వార్డెన్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
