విదేశాల్లో ఎక్స్‌పైర్డ్ ఫుడ్స్ తెచ్చి డేట్ మార్చి అమ్ముతున్నరు.. జాగ్రత్త!

విదేశాల్లో ఎక్స్‌పైర్డ్ ఫుడ్స్ తెచ్చి డేట్ మార్చి అమ్ముతున్నరు.. జాగ్రత్త!

ఖరీదైన మాల్స్, హై-ఎండ్ గ్రోసరీ స్టోర్లలో దొరికే విదేశీ చాక్లెట్లు, డ్రింక్స్ చూడగానే వాటిని నాణ్యమైనవని నమ్మి కొంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. అమెరికా, బ్రిటన్, దుబాయ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కాలం చెల్లిన అదే ఎక్స్‌పైరీ అయిన ఆహార పదార్థాలను మళ్లీ ప్యాకేజింగ్ చేసి.. పేరున్న పెద్దపెద్ద స్టోర్లకు విక్రయిస్తున్న ఒక భారీ రాకెట్‌ను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. వీరి వద్ద దాదాపు రూ. 4కోట్ల 30లక్షలు విలువైన కాలం చెల్లిన తినుబండారాలను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

ఈ ముఠా విదేశాల్లో గడువు ముగిసిన ప్రముఖ బ్రాండ్ల ఆహార ఉత్పత్తులను చాలా తక్కువ రేట్లకు కొనుగోలు చేసేవారు. వాటిని భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత.. ఢిల్లీలోని రహస్య గోడౌన్లలో వాటి అసలు ప్యాకేజింగ్‌ను మార్చేవారు. పాత ఎక్స్‌పైరీ డేట్లను చెరిపేసి.. కొత్త తేదీలతో లేబుళ్లను అంటించేవారు. కొనేవాళ్లకు ఆ వస్తువులు తాజాగా తయారైనట్లుగా భ్రమింపజేసేవారు. ఇలా సిద్ధం చేసిన ఉత్పత్తులను మోడరన్ బజార్, నేచర్స్ బాస్కెట్ వంటి పేరున్న రిటైల్ స్టోర్లతో పాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సామాన్య ప్రజలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల దాడుల్లో సుమారు 43వేల 762 కిలోల ఆహార పదార్థాలు, 14వేల 665 లీటర్ల డ్రింక్స్ బయటపడ్డాయి. ఇందులో పిల్లలు ఇష్టంగా తినే ఓరియో బిస్కెట్లు, కిట్‌క్యాట్, క్యాడ్‌బరీ, నూటెల్లా, ప్రింగిల్స్ చిప్స్‌తో పాటు స్టార్‌బక్స్, నెస్కేఫ్, లిప్టన్ వంటి బ్రాండ్ల డ్రింక్స్ ఉన్నాయి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ రాకెట్‌లో చిన్నారులు తినే బేబీ ఫుడ్ కూడా ఉండటమే. ఇవన్నీ గడువు ముగిసినవి కావడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, స్టోర్ల యజమానుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. విదేశీ బ్రాండ్ల పట్ల ఉన్న ప్రజల్లో ఉన్న ఇష్టాన్ని ఈ ముఠా సొమ్ము చేసుకుంటోంది. కాబట్టి ఎంత పెద్ద స్టోర్‌లో కొన్నా సరే.. ప్యాకింగ్‌పై ఉన్న లేబుల్ అతికించినట్లు ఉందా లేదా ప్రింట్ అయ్యి ఉందా అనేది గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. కేవలం విదేశీ బ్రాండ్ అనే భ్రమలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అంటున్నారు. ఇది చూస్తుంటే నాణ్యమైన వస్తువులు తక్కువ రేటుకు ఊరకే రావు బాస్ అనిపిస్తోంది చాలా మంది వినియోగదారులకు ఇప్పుడు.