
తెలంగాణ తన వల్లే వచ్చిందని కేసీఆర్ అనుకుంటున్నారని అన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఎందరో పోరాటం చేస్తే రాష్ట్రం వచ్చిందన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్నవాళ్లెవరూ ఉద్యమకారులు కాదన్నారు. వాళ్లంతా ఉద్యమకారులను అణచివేయాలని చూసిన వాళ్లే అన్నారు. కేసీఆర్ కు డబ్బులున్నాయనే మదమెక్కిందన్నారు జితేందర్ రెడ్డి. డబ్బులు, మద్యం పంచితే చాలు ప్రజలు ఓట్లేస్తారనరని అనుకుంటున్నారన్నారు. కానీ దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ దిమ్మ దిరిగిపోయిందన్నారు మాజీ ఎంపీ. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే.. ఆయనను ఎవరు రానీస్తారంటూ ప్రశ్నించారు. మిగులు రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రావడంలేదని విమర్శించారు. కేవలం ఇప్పుడు వస్తున్న నీళ్లన్నీ ఎస్సారెస్పీ నుంచి వచ్చినవే అన్నారు. లక్ష కోట్ల రూపాయలు ఎందుకు పనికి రాకుండా పోయాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రెండు ఏళ్లలో పూర్తి చేస్తానని మరిచిపోయాడన్నారు. అందరినీ మభ్యపెడుతూ చివరకు అంబేద్కర్ ను మభ్యపెడుతున్నారన్నారు. ఆ మహానీయుడు రచించిన రాజ్యాంగానికే ఎసరు పెడుదామని అనుకుంటున్నాడని ఆరోపించారు జితేందర్ రెడ్డి. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, దళితబంధులాంటి పథకాల పేరుతో ఇప్పటికే దళితులను మోసం చేశారన్నారు. ఇలా ఎన్ని రకాలుగా మోసం చేస్తాడన్నారు మాజీ ఎంపీ.
తెలంగాణ ఆర్థిక విధానాన్నే బాగు చేయలేనోడు... దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మన స్టేట్ ఓన్ రెవెన్యూ మొత్తం లిక్కర్, మైనింగ్, కమర్షియల్, ట్యాక్స్, గ్యాస్, పెట్రోలు మీద 74 వేల కోట్లు వస్తుందన్నారు. రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 74 వేల కోట్లైతే.. నాలుగున్నర కోట్ల అప్పు తీసుకున్నాడని ఆరోపించారు. ఇందుకోసం 42 వేల కోట్లు వడ్డీకే పోతున్నాయన్నారు. 50 వేల కోట్లు ఫించన్లకే పోతున్నాయని విమర్శించారు. సెంట్రల్ ఫండ్స్ రాకుంటేనే ఇవన్నీ నడిపిస్తున్నారా? అంటూ మాజీ ఎంపీ ప్రశ్నించారు. 29 స్కీంల ద్వారా రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని.. వాటితోనే రాష్ట్రం నడుస్తోందన్నారు. విద్య, వైద్యానికి కూడా కేంద్రమే డబ్బులిస్తోందన్నారు. రాష్ట్రంలోని రహదారులకు పెట్టిన నిధులన్నీ కేంద్రానివే అన్నారు.
కేసీఆర్ రాజ్యాంగం రచిస్తే అందులో బూతులు తప్ప ఏమీ ఉండవన్నారు. కేసీఆర్ పాలన సాగితే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవన్నారు. కేసీఆర్ కు కమిషన్లు వచ్చే పథకాలకే నిధులన్నీ కేసీఆర్ మళ్లిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తికి రాజ్యాంగాన్ని సవరించే హక్కుందా? అంటూ జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. దళితులకు 19 శాతం నిజంగానే రిజర్వేషన్లు పెంచాలంటే సవరణ ద్వారా చేసుకోవచ్చన్నారు. కానీ ఏనాడైనా మీ ఎంపీలు దీనిపై ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి మూర్ఖున్ని అధికారంలో నుంచి దింపకపోతే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని విమర్శించారు మాజీ ఎంపీ.
ఇవి కూడా చదవండి:
ఏపీ ప్రజలకు ఊరట.. తగ్గిన కరోనా కేసులు
సర్జికల్ స్ట్రైక్ వీడియో పోస్ట్ చేసిన అసోం సీఎం