
భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ పై అనుమానం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ధైర్య సాహసాలు గల ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియో గ్రాఫిక్ ఆధారాలను చూడండంటూ కూ యాప్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
"కేసీఆర్ గారూ, ధైర్యసాహసాలు కలిగిన మన ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి వీడియోగ్రాఫిక్ ఆధారాలు చూడండి. వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ మీరు సాయుధ దళాల సత్తాను ప్రశ్నిస్తూ అవమానిస్తున్నారు. సైన్యంపై దాడి చేసేందుకు, అవమానించేందుకు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారు. భారత ఆర్మీని అవమానించడాన్ని నవభారతం సహించదు." అని కూ యాప్ లో వీడియో పోస్ట్ చేశారు. 5నిమిషాలకుపైగా నిడివి ఉన్న వీడియోలో మ్యాపుల స్క్రీన్ షాట్స్, శాటిలైట్ ఇమేజెస్, వీడియో కట్ షాట్స్ ఉన్నారు.