కాంగ్రెస్​లోకి వివేక్.. కుమారుడు వంశీకృష్ణతో కలిసి రాహుల్​ సమక్షంలో చేరిక

కాంగ్రెస్​లోకి వివేక్..  కుమారుడు వంశీకృష్ణతో కలిసి రాహుల్​ సమక్షంలో చేరిక
  • ఫోన్​ చేసి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి రాజీనామా చేశారు. తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి బుధవారం కాంగ్రెస్​ ముఖ్య నేత రాహుల్​గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. అంతకుముందు ఆయన ఏకవాక్యంతో రాజీనామా లేఖను బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డికి పంపించారు. భారమైన హృదయంతో తాను బీజేపీని వీడుతున్నట్లు, ఇన్నాళ్లూ తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. 

రాహుల్​తో అరగంటపాటు భేటీ

వివేక్​ తన కుటుంబంతో కలిసి శంషాబాద్​లోని నోవాటెల్​కు వెళ్లి అక్కడ రాహుల్​గాంధీతో సమావేశమయ్యారు. అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం వివేక్​ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ కృష్ణకు రాహుల్​ గాంధీ కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. అంతకముందు వివేక్​కు ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఫోన్ ​చేసి పార్టీలోకి రావాల్సిందిగా కోరారు.   కాంగ్రెస్​లో చేరిన అనంతరం వివేక్​, ఆయన భార్య సరోజ, కుమారుడు వంశీకృష్ణ ట్యాంక్​బండ్​ వద్ద గల కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.