
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తో పాటు పెద్దపల్లి జిల్లా స్థానిక నేతలు పాల్గొన్నారు.
2009లో పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు వివేక్ వెంకటస్వామి. ఆ తర్వాత ఉద్యమం టైంలో తెలంగాణ కోసం కీలకంగా పనిచేశారు. బిల్లు కోసం లోక్ సభలో సొంతపార్టీ కాంగ్రెస్ పైనే పోరాటం చేశారు. తెలంగాణ కోసం లోక్ సభలో సొంత పార్టీతో సస్పెండ్ అయ్యారు. అయితే కొంత కాలంగా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. సెక్రటరియేట్ కూల్చివేత, అసెంబ్లీ తరలింపు, ఎర్రమంజిల్ హెరిటేజ్ భవనాల కూల్చివేతలపై అన్ని పార్టీలను ఏకం చేశారు. ఆల్ పార్టీ నేతలతో కలిసి సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సర్కార్ చేస్తున్న ప్రజా ధనం దుర్వినియోగంపై గొంతెత్తారు. ఈ సమావేశంలో సర్కార్ నిర్ణాయాలకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు.
నిరంకుశ నిర్ణయాలతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ…. సెక్రటరియేట్ కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆపివేయాలని… ఇటు గవర్నర్ నరసింహన్ కు ఆల్ పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నింటికి గవర్నర్ దే ఫైనల్ నిర్ణయం కాబట్టి… చారిత్రక కట్టడాల కూల్చివేతలను ఆపేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇదే విషయంపై రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన వివేక్ వెంకట స్వామి… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి…. సర్కార్ నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. హెరిటేజ్ భవనాల కూల్చివేతలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ పార్టీ నిర్ణయాలను అమిత్ షాకు తెలియజేశారు. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ఆల్ పార్టీ నేతలతో కలిసి ధర్నా చేశారు. సెక్రటరియేట్ ముట్టడికి ప్రయత్నించటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
టీఆర్ఎస్ పాలనపై స్వయంగా ఆల్ పార్టీతో కలిసి పోరాటం చేస్తున్న వివేక్ వెంకటస్వామిని తమ పార్టీలో చేరాల్సిందిగా వివిద జాతీయ పార్టీలు ఆహ్వానించాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… స్వయంగా వివేక్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోకి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే కేసీఆర్ నిరంకుశ పాలనను ఎదుర్కొనేందుకు బీజేపే బలమైన వేదికని… భావించిన వివేక్ వెంకటస్వామి… తమ అనుచరులతో చర్చించి… బీజేపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. షాను వివేక్ వెంకటస్వామి కలిసిన సమయంలో కేంద్ర హోంమశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్… ఎంపీ అర్వింద్ తో పాటు… మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఉన్నారు.