కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య

కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య

కేంద్ర మాజీమంత్రి పీఆర్ కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం (67) హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని తన నివాసంలో ఆమె హత్య చేయబడ్డారు. కుమారమంగళం ఇంట్లో దోభీగా పనిచేసే రాజు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో డోర్ కొట్టాడు. వెంటనే ఇంట్లో పనిచేసే పనిమనిషి డోర్ ఓపెన్ చేసింది. దోభీ రాజు మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి.. పనిమనిషిని ఒక రూంలో తాళ్లతో కట్టి బంధించారు. అనంతరం మరో రూంలో ఉన్న కిట్టి కుమారమంగళం వద్దకు చేరుకొని దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. 

రాత్రి 11 గంటల సమయంలో తమకు సమాచారమందిందని డీసీపీ ప్రతాప్ సింగ్ తెలిపారు. నిందితులలో ఒకరైన రాజును వసంత్ విహార్ ప్రాంతంలోని భన్వర్ సింగ్ క్యాంపులో అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణలో రాజు మరో ఇద్దరు నిందితుల పేర్లు కూడా వెల్లడించాడని.. వారికోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
కిట్టీ కుమారమంగళం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆమె భర్త పీ రంగరాజన్‌ కుమారమంగళం మొట్టమొదటిసారిగా సేలం నియోజకవర్గం నుంచి 1984లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రభుత్వలో విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పీఆర్ కుమారమంగళం ఆగష్టు 23,2000 సంవత్సరంలో మృతిచెందారు. కిట్టీ కుమారమంగళం కుమారుడు రంగరాజన్‌ మోహన్‌ కుమారమంగళం కాంగ్రెస్‌ నేత. ఆయన తమిళనాడుకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి హత్య వార్త తెలుసుకున్న వెంటనే ఆయన ఢిల్లీకి బయలుదేరారు.