కాంగ్రెస్​లో భారీగా చేరికలు

కాంగ్రెస్​లో భారీగా చేరికలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో ఇతర పార్టీల నేతల చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, వరంగల్​జిల్లా బీఆర్ఎస్ నేత నాగపురి కిరణ్​కుమార్​గౌడ్ జాయిన్ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కండువాలు కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

వేణుగోపాలచారి మూడు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వరరావు రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. కిరణ్​కుమార్​గౌడ్ అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో బీఆర్ఎస్​వార్​రూమ్​లో కీలకంగా పనిచేశారు. వీరితో పాటు సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ అనితాదయాకర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం: జీవన్ రెడ్డి

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవన్ రెడ్డి అన్నారు. బాధితులకు అండగా ఉండి.. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. దశాబ్ద కాలంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. మాజీ ఎంపీ కవిత నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదని, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసును బోర్డ్ ఏర్పాటు చేయించలేదని ఆరోపించారు. తనను ఎంపీగా గెలిపిస్తే.. ఏడాది కాలంలో ఇందూరు గడ్డమీద పసుపు బోర్డ్ ఏర్పాటు చేయిస్తానని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తానని జీవన్​రెడ్డి హామీ ఇచ్చారు. రాహుల్ ప్రధాని కాగానే గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కోరుట్ల బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా..

కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్​లో జాయిన్ అయ్యారు. వీరికి గాంధీ భవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో బీజేపీ నుంచి జెఎన్ వెంకట్, లింగారెడ్డి, మాజీ జడ్పీటీసీలు సునీత, బీఆర్ఎస్ నుంచి మాజీ జడ్పీటీసీ పురుషోత్తం, మాజీ ఎంపీపీ దేవేందర్, కోరుట్ల సెగ్మెంట్​నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శ్రీనివాసరావుతో పాటు పెద్ద సంఖ్యలో రెండు పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.