పరీక్షల భయం పోగొట్టే ‘ఎగ్జామ్స్ వారియర్స్’

పరీక్షల భయం పోగొట్టే ‘ఎగ్జామ్స్ వారియర్స్’

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ.. యువతకు స్ఫూర్తిదాయకమైన నాయకుడు. ఆయన నిర్వహించిన నెలవారి రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ సమాజంలోని అన్ని వర్గాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ కార్యక్రమంలోనే 2015లో తొలిసారిగా ఆయన ఎగ్జామ్స్ వారియర్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత 2016, 2017లో ప్రసంగించారు. తర్వాత 2018, 2019 ,2020 సంవత్సరాల్లో ‘పరీక్ష పే చర్చ’ పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ప్రధాని మోడీ రచించిన ఎగ్జామ్స్ వారియర్స్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ప్రచురితమైంది. ఇది కేవలం విద్యార్థులకే కాదు, తల్లిదండ్రులకు టీచర్లకు కూడా ప్రోత్సాహాన్నిచ్చే పుస్తకం. ఉదాహరణలు, చిత్రాలు, కృత్యాల సూచనలు, యోగాసనాలతో సమ్మిళితమై సరదాగా సంభాషించినట్లు ఉన్న పుస్తకం ఇది. పరీక్షల సమయంలో విద్యార్థులకు, వారు భావి జీవితంలో ఎదుర్కొనే అనేక విషయాల పట్ల అత్యుత్తమ నేస్తం ఈ పుస్తకం. వాస్తవికంగా ఆలోచనలు రేకెత్తిస్తూ పోయే ఈ పుస్తకం యువతకు అందుబాటులో ఉన్న చక్కని మార్గదర్శి.

భయాలను తొలగించడం

ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’లో ప్రధానంగా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. ఒత్తిడి ఎదుర్కొనే విద్యార్థుల కోసం వారిలో ఉన్న భయాలను తొలగించడానికి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయడం గొప్ప విషయం. ఎగ్జామ్స్ వారియర్స్ పుస్తకం మంత్రాలు1 నుంచి 28 వరకు ప్రధానంగా విద్యార్థులకు సంబంధించినవి. వీటిలో చాలా మట్టుకు జీవితాన్ని నేర్చుకునే, అనుభవంగా భావించే వారికి వర్తిస్తాయి. పరీక్ష హాల్​లో ముఖ్యమైన చిన్న చిన్న విషయాలు మొదలుకొని, తరగతిగది దాటి తనతో తను పోటీ పడటం వరకూ, సమయ నిర్వహణ నుంచి, సాంకేతికత వరకు, కృతజ్ఞత నుంచి లక్ష్యాన్ని నిర్దేశించడం వరకు తనను తాను కనుగొనడానికి పుస్తకం బాగా తోడ్పడుతుంది. యువతకు ఆసక్తి కలిగించే అనేక అంశాలను పుస్తకం స్పృశించింది.

తల్లిదండ్రులకు సూచనలు

ఈ పుస్తకం రెండో ఎడిషన్ లో కీలక భాగం విద్యార్థుల తల్లిదండ్రుల కోసం నిర్దేశితమైంది. మంత్రాలు 29 నుంచి 34 వరకు తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు ఉన్నాయి. పిల్లల కోసం సానుకూల వాతావరణం నెలకొల్పడంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలనే దానిపై, అనేక విషయాలను ఇందులో పొందుపరిచారు. పుస్తక సారాంశాన్ని క్లుప్తంగా చూస్తే పరీక్షల విషయానికొస్తే అతిగా ఆందోళన పడటం, దాన్ని జీవన్మరణ పరిస్థితిగా పరిగణించాల్సిన అవసరం లేదని పుస్తకం సూచిస్తున్నది. ‘‘మిమ్మల్ని మీరు విశ్వసించండి. అనుసరించండి. జ్ఞానం, జీవితంతో సహా మిగతావన్నీ దారికి వస్తాయి”అని విద్యార్థులకు ప్రధాని మోడీ నిర్దేశించారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు ‘ఎగ్జామ్స్ వారియర్స్’ కు ఎంతో శక్తిని కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. పుస్తకముఖచిత్రం నరేంద్ర మోడీ చిత్రంతోపాటు భావి భారత విద్యార్థుల చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.


యాడవరం చంద్రకాంత్ గౌడ్,  తెలుగు పండిట్