లిఫ్ట్​ రిపేర్లకు నో ఫండ్స్​

లిఫ్ట్​ రిపేర్లకు నో ఫండ్స్​

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలోని ఎత్తిపోతలు పనిచేయడం లేదు. దశాబ్దాల కింద నిర్మించిన ఎత్తిపోతలు శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు వర ప్రదాయిని అయిన సింగూరు ప్రాజెక్టుకు ఎగువ భాగాన ఉన్న జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఎత్తిపోతలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అవి సరిగ్గా పనిచేయక జిల్లాలో వేలాది ఎకరాలు బీడుగా మారుతున్నాయి. తలాపునే సింగూరు, మంజీరా ప్రాజెక్టులు ఉన్నా తాగు, సాగు నీటి కష్టాలు తీరట్లేదు. ఫలితంగా ఏటా బతుకు దెరువు కోసం రైతులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. దాదాపు 8 నెలలు అక్కడ ఉండి తిరిగి సొంతూరుకు వస్తారు. కొత్తగా నిర్మించనున్న బసవేశ్వర, సంగమేశ్వర భారీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులేమో అర్ధాంతరంగా ఆగిపోయాయి. భూములు సేకరించే విషయంలో తలెత్తిన వివాదాలు ఈ రెండు ఎత్తిపోతలకు అడ్డంకులుగా మారాయి. అయితే కొత్త ఎత్తిపోతల మాట పక్కన పెడితే కనీసం ఉన్న వాటికి ఫండ్స్ కేటాయించి రిపేర్లు చేస్తే కొంతవరకైనా ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పరిస్థితి ఇలా...
మంజీరా నదిపై 20 ఏండ్ల కింద మనూర్, నాగల్ గిద్ద, న్యాల్కల్, రాయికోడ్, జహీరాబాద్ మండలాల్లోని కారాముంగి, షాపూర్, పుల్కుర్తి, తోర్నాల, అమీరాబాద్ గ్రామాల పరిధిలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. రూ.350 కోట్లతో నిర్మించిన ఈ ఎత్తిపోతలను దాదాపు 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని నిర్దేశించారు. వీటికి నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోగా కొంతకాలం సత్ఫలితాలు ఇచ్చాయి. ఆ తర్వాత బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుని రైతులకు కమిటీల రూపంలో అప్పగించింది. విద్యుత్ బిల్లులు, శాలరీలు ఇతరత్రా మెయింటెనెన్స్ ఆయకట్టు రైతులే భరించాల్సి వచ్చింది. దీంతో సరిపడా నిధులు లేక రైతుల మధ్య విభేదాలు తలెత్తి ఎత్తిపోతల మెయింటెనెన్స్ దెబ్బతిని నిర్వీర్యమయ్యాయి. వీటికి తోడు మనూర్ మండలం బోరంచలో 2,900 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఏడున్నర ఏండ్ల కింద ఎత్తిపోతల పథకానికి పనులు ప్రారంభించగా, ట్రయల్స్ లేక నాలుగేండ్ల కింద లీకేజీలు బయటపడ్డాయి. అక్కడితో వాటికి స్వస్తి చెప్పి వాటి గురించి పట్టించుకోలేదు. ఇక పుల్కల్ మండలంలో 29.917 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు సాగునీటికి అంతగా ఉపయోగపడటం లేదు. ఎగువన ఉన్న ఎత్తిపోతలు, దిగువన ఉన్న కాల్వలకు రిపేర్లు లేక సింగూరు ఆయకట్టు రైతులు పరేషాన్ లో ఉన్నారు. ఈ క్రమంలో రానురాను జిల్లాలో సాగునీటి సౌకర్యాలు కరువై వ్యవసాయం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను బాగు చేయించాలని రైతులు కోరుతున్నారు.

భూములన్నీ బీడువారుతున్నాయి.. 
నీళ్లు లేక నాకున్న ఐదెకరాలలో మూడు ఎకరాలు బీడుపెట్టాను. జహీరాబాద్ ప్రాంతంలో వేలాది ఎకరాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. నారింజ ప్రాజెక్టు పూడికతీత లేక ఆయకట్టు 
రైతులు వ్యవసాయం విడిచి హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటున్నారు. 
-  కేశవులు, రైతు, కారముంగి

రిపేర్​ చేయించాలి
అమీరాబాద్ ఎత్తిపోతల కింద మూడు వేల ఎకరాలు ఉంటాయి. ఇక్కడ ఎత్తిపోతలు పనిచేయకపోవడంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. బోరుబావులు, చెరువులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆఫీసర్లు స్పందించి వెంటనే ఎత్తిపోతలకు రిపేర్లు చేయించాలి. 
-   వీరయ్య, రైతు,అమీరాబాద్

బడ్జెట్ కేటాయించాల్సి ఉంది..
పాత ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. గతేడాదిలో ఉన్న బడ్జెట్ ను ఉపయోగించి కొన్ని ఎత్తిపోతలకు రిపేర్లు చేశాం. ఈసారి ఫండ్స్  కోసం ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపించాం. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.
-  జలంధర్, డీఈఈ, ఇరిగేషన్ శాఖ