మంచిర్యాల డీసీసీ పగ్గాలు ఎవరికో? ..రేసులో 29 మంది ఆశావహులు

మంచిర్యాల డీసీసీ  పగ్గాలు ఎవరికో? ..రేసులో 29 మంది ఆశావహులు
  •     దరఖాస్తులు స్వీకరించిన ఏఐసీసీ అబ్జర్వర్ 
  •     సీనియారిటీ, సమర్థత ఆధారంగా ఎంపిక
  •     హై కమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూపు 

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్(డీసీసీ) ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ హై కమాండ్ ఈసారి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. దీంతో అదృష్టం ఎవరిని వరిస్తుందోనని క్యాడర్ లో ఆసక్తి నెలకొంది. ఇటీవల జిల్లాకు వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ కుమార్  మూడు సెగ్మెంట్లలో మీటింగులు నిర్వహించారు. ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. ఆయనకు 29 మంది నేతలు దరఖాస్తులు అందజేశారు. 

 డీసీసీ రేసులో పలువురు సీనియర్ లీడర్లతో పాటు జూనియర్లు సైతం నిలవడం ఆసక్తికరంగా మారింది. అయితే బ్లాక్ లెవల్ నుంచి జిల్లాస్థాయి వరకు కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను ఏఐసీసీ అబ్జర్వర్ తీసుకున్నారు. అలాగే డీసీసీకి పోటీ పడుతున్న లీడర్లను విడివిడిగా ఇంటర్వ్యూ చేశారు. ఇందులోంచి ముగ్గురు లేదా ఐదుగురు సమర్థులైన నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హై కమాండ్ కు పంపించనున్నారు. ఏఐసీసీ అబ్జర్వర్లు అందజేసిన నివేదికల ఆధారంగా పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనుంది. 

పాతోళ్లకు నో చాన్స్..

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ చైర్ పర్సన్ గా కొక్కిరాల సురేఖ గత రెండు టర్మ్ లు పనిచేశారు. ఈసారి సైతం ఆమెకే పగ్గాలు అప్పగించే చాన్స్  ఉందని ప్రచారం జరిగింది. కానీ పాత వాళ్లకు చాన్స్ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇవ్వడంతో సురేఖ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పలువురు కొత్త నేతలు తెరపైకి వచ్చి అప్లికేషన్లు అందజేశారు.

రేసులో 29 మంది..

మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి సెగ్మెంట్లలో మొత్తం 29 మంది నేతలు డీసీసీ రేసులో నిలుస్తూ ఏఐసీసీ అబ్జర్వర్ కు అప్లికేషన్లు అందజేశారు.  పార్టీ సీనియర్ నేతలు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, కేవీ ప్రతాప్, డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, గడ్డం త్రిమూర్తి, నూకల రమేశ్, కారుకూరి చంద్రమౌళి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సీనియారిటీ, సమర్థత, కార్యకర్తలు, నేతల మద్దతు ఆధారంగా డీసీసీ చైర్మన్ ను హై కమాండ్ సెలెక్ట్ చేసే చాన్స్ ఉంది. 

గత రెండు టర్ముల్లో మంచిర్యాల సెగ్మెంట్ కు పదవి దక్కడంతో ఈసారి చెన్నూరు సెగ్మెంట్ కు  చాన్స్ ఉందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మంచిర్యాల సెగ్మెంట్ కు చెందిన నేతలు సైతం అదృష్టం తమనే వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డీసీసీ పీఠం బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. హై కమాండ్ నిర్ణయం కోసం ఆ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.