వరంగల్, వెలుగు: విద్యుత్ పంపిణీ రంగంలో అమలు చేసిన వినూత్న కార్యక్రమాలకు గాను ఎన్‍పీడీసీఎల్ సంస్థకు ‘ఎక్సలెన్స్ ఫర్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ ఆపరేషనల్ లీడర్‍షిప్ అవార్డ్ దక్కింది. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‍లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‍రెడ్డి మాట్లాడుతూ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అత్యుత్తమ సేవలను గుర్తించి ఇటీవల న్యూ ఢిల్లీలో ఈ అవార్డ్ అందించారని తెలిపారు. అలాగే ఐపీపీఏఐ(ఇప్పాయి) పవర్ అవార్డ్–2026 ఇన్నోవేషన్ విభాగంలోనూ ఎన్‍పీడీసీఎల్‍కు మరో పురస్కారం దక్కిందని చెప్పారు. వినూత్న సాంకేతిక పద్ధతులతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేయడంలో భాగస్వాములైన ప్రతి ఉద్యోగికి దక్కిన గౌరవమని తెలిపారు.
ఎన్‍పీడీసీఎల్ లో ఏఐ ఆధారిత ఫీడర్ ఔటేజ్ అంచనా విధానంతో ఫీడర్ రిస్క్ ప్రిడిక్షన్ అండ్ ఔటేజ్ ఫోర్‍కాస్టింగ్ మోడల్‍ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 17 జిల్లాల పరిధిలో 72 లక్షల సర్వీసులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు నగర బాట, పొలం బాట కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు.
ఆర్‍టీఎఫ్‍ఎంఎస్ అమలు, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల ఏర్పాటు, 1912 కాల్ సెంటర్, వాట్సాప్ చాట్‍బాట్, యూపీఐ ద్వారా బిల్లుల చెల్లింపులు వంటి డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో మెరుగైన సేవలు అందించడంలో సక్సెస్ అవుతున్నట్లు చెప్పారు. డైరెక్టర్లు వి.మోహన్‍రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు రాజు చౌహాన్, అశోక్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
