హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఎంట్రప్రెనూర్లకు ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలియజేసింది. ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియా సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ ఈ అవార్డులను1974 నుంచి ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఎంట్రప్రెనూర్ల కార్యకలాపాలు, విశిష్ట సేవలకు గాను వీటిని అందజేస్తున్నట్లు చెప్పారు.
కిందటి ఏడాది వరకు 22 కేటగిరీలు ఉండేవని, ఈ సంవత్సరం 'స్టార్టప్' అనే కొత్త కేటగిరీని చేర్చామని వెల్లడించారు. ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ కమిటీ చైర్మన్ అరుణ్ లుహారుకా జ్యూరీకి నాయకత్వం వహిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు అందించడం, అధిక ఉత్పత్తి సాధించడం, రాష్ట్ర, కేంద్రం జీడీపీకి సహకరించిన కంపెనీలను, సంస్థలను అవార్డులకు ఎంపిక చేస్తారు. దాదాపు150 ఎంట్రీలు వస్తాయని కమిటీ అంచనా వేసింది. నామినేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 15 అని ప్రకటించింది.
ఎగుమతులు, మార్కెటింగ్, ఇన్నోవేషన్, ఆర్&డి టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయీ వెల్ఫేర్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ, టూరిజం ప్రమోషన్, ఛాంబర్/అసోసియేషన్ వంటి రంగాల కంపెనీలతోపాటు వ్యక్తులూ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.