పిల్లలు గంటల తరబడి ఫోన్లు చూస్తున్నరా?.. మెడనొప్పి, భుజాల నొప్పులు ఖాయం

పిల్లలు గంటల తరబడి ఫోన్లు చూస్తున్నరా?.. మెడనొప్పి, భుజాల నొప్పులు ఖాయం
  • శరీర భంగిమ దెబ్బతింటుందన్నట్లు డాక్టర్లు  
  • బయట ఆడించాలని, స్క్రీన్​టైం తగ్గించాలని సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ‘ఏంటి మీ పిల్లలు..గంటల తరబడి తలవంచి మొబైల్ ఫోన్లలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం చేస్తున్నారా? అయితే, మెడనొప్పి, భుజాల నొప్పులు రావడంతో పాటు శరీర భంగిమ దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అక్టోబరు16న ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్, హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్స్ స్పైన్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు పలు సూచనలు చేశారు. 

గంటల తరబడి మొబైల్ స్క్రీన్ల వైపు తలవంచి చూడటం వల్ల వచ్చే ఈ సమస్యను టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ లేక ‘టెక్ నెక్’ అని పిలుస్తారని, దీనివల్ల పిల్లల వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడి, భవిష్యత్తులో పోశ్చర్స్​ప్రాబ్లమ్స్​వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే, పిల్లలకు ఫోన్ల నుంచి దూరం ఉంచాలని, అలా వీలు కాని పక్షంలో స్క్రీన్​టైంను చాలావరకు తగ్గించాలని సూచిస్తున్నారు.  

మెడ, భుజాల కండరాలు బలోపేతం కావడానికి రోజూ సాయంత్రం ఓ గంటైనా బయట ఆడుకునేలా ప్రోత్సహించాలంటున్నారు. వారితో తేలికపాటి మెడ స్ట్రెచెస్, భుజాలు తిప్పడం వంటి చిన్న చిన్న ఎక్సర్​సైజ్​లు రోజులో రెండు మూడు సార్లు చేయించాలని సలహా ఇస్తున్నారు. పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారని, కాబట్టి పెద్దలు ఇంట్లో గంటల తరబడి ఫోన్లలో మునిగిపోవద్దంటున్నారు.