బషీర్బాగ్, వెలుగు: ఎక్సైజ్ శాఖ ఖజానా నింపడానికి బార్ అండ్ రెస్టారెంట్స్ పై భారం మోపుతున్నారని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. నష్టాల్లో నడుస్తున్న బార్లపై జీవో నంబర్ 145 తీసుకొచ్చి మరో భారం వేశారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా తీసుకొచ్చిన జీవోను సవరించాలని రవీంద్రభారతిలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు చేస్తున్న తప్పిదాలతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. సెప్టెంబర్ 30న బార్ల లైసెన్స్ రెన్యూవల్ ఫీజును రూ.40 లక్షలు చెల్లించామన్నారు. ఈ నెల 14న తెచ్చిన జీవో ద్వారా అదనంగా రూ.4 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు చెప్పడం అన్యాయమన్నారు.
