- నిరూపించలేకపోతే హరీశ్‌రావు రాజీనామా చేస్తారా ?
- మానేరు మీద చెక్‌డ్యామ్‌లు కట్టింది బీఅర్‌ఎస్ వాళ్లే...
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
కరీంనగర్, వెలుగు : ‘మానేరుపై నిర్మించిన గుంపుల తనుగుల చెక్‌డ్యామ్‌ను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చినట్లు హరీశ్‌రావు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంట.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నిరూపించలేకపోతే హరీశ్‌రావు రాజకీయల నుంచి తప్పుకుంటారా ?’ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సవాల్ చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌తో కలిసి బుధవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు.
ఇసుక మాఫియాకు పాల్పడింది బీఆర్‌ఎస్ వాళ్లేనని, కేటీఆర్ నియోజకవర్గంలో దళితులను విచక్షణారహితంగా కొట్టి జైలులో వేశారని గుర్తు చేశారు. మంథని నుంచి కరీంనగర్ వరకు నిర్మించిన చెక్‌డ్యామ్‌లలో నాణ్యత లేదని, డిజైన్ కరెక్ట్‌గా లేదని ఆరోపించారు.
శ్రీరాంపూర్ మండలం మీర్జాంపేట(పోచంపల్లి) చెక్‌డ్యామ్ నాలుగేండ్ల కిందే కూలిపోగా, రూపునారాయణపేట, వీణవంక, మడక, మల్లారెడ్డిపల్లెలో ఉన్న చెక్‌డ్యామ్, సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి, నీరుకుల్ల, గొల్లపల్లి, ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలోని చెక్‌డ్యామ్‌లుసైతం సైతం కూలిపోయాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 2009 – 14లో గంగారం దగ్గర 14 కోట్లతో నిర్మాణం చేసిన చెక్‌డ్యామ్ ఎన్ని వరదలు వచ్చినా అలాగే ఉందన్నారు.
సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపల ప్రకాశ్‌రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆకుల నర్సన్న, గోపగాని సరయ్య గౌడ్ పాల్గొన్నారు.
