వైఎస్సార్​ పేరును..షర్మిల చెడగొడుతున్నరు:మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్

 వైఎస్సార్​ పేరును..షర్మిల చెడగొడుతున్నరు:మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్

మహబూబ్​నగర్, వెలుగు: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి షర్మిల చెడ్డ పేరు తెస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కాలేజీని మంత్రి ప్రారంభించారు. తర్వాత కౌకుంట్ల మండల కేంద్రానికి వెళ్లి తహసీల్ కార్యాలయాన్ని ఓపెన్​ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడారు. ‘‘వైఎస్ షర్మిల ఎవరంటే.. అందరూ వైఎస్సార్​ కూతురు అంటారు. ఆమె మాటలను చూసి, వైఎస్సార్ బిడ్డ ఇట్ల మాట్లాడుతుందేంటని అడుగుతున్నరు.

ఎమ్మెల్యేలు, మంత్రులను చెప్పుతో కొడతానని, మొగోనివా? అంటూ మాట్లాడుతున్నది. ఇలా మాట్లాడితే వైఎస్సార్​కే చెడ్డ పేరు వస్తది. ఇలా మాట్లాడితే తెలంగాణలో నడవదు. ఇక్కడి ప్రజలు ఆత్మాభిమానంతో బతుకుతారని ఆమె కుటుంబ సభ్యులే షర్మిలకు చెప్పాలి”అని శ్రీనివాస్​గౌడ్ అన్నారు. తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలా మాట్లాడరని విమర్శించారు. కేసీఆర్​పై ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తే ప్రజలు సహిస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించిన అంశంపై మాత్రమే విమర్శలు చేశామని, వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి తదితరులు 
పాల్గొన్నారు.