
హైదరాబాద్: కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన 13 ఎంపీ టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. దాదాపు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఫైనల్ చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఇందులో నుంచి కేవలం నలుగురి పేర్లను మాత్రమే సీఈసీ ఫైనల్ చేసింది. మిగతా ఏడు సెగ్మెంట్లకు క్యాండిడేట్లను తేల్చలేదు. వీటితో పాటు 13 లోక్ సభ స్థానాల్లో సునీల్ కనుగోలు టీం ఆధ్వర్యంలో ఫ్లాష్ సర్వే నిర్వహిచింది. ఇందుకు సంబంధించిన రిపోర్టు కూడా ఏఐసీసీకి చేరింది. అయితే దీనిపై మరో మారు స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోవాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపా దాస్ మున్షి ఇవాళ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఒక్కక్కరితో మాట్లాడుతూ వాళ్లు చెప్పిన పాయింట్స్ ను నోట్ చేసుకుంటున్నారు. వాటిని హైకమాండ్ కు పంపుతారని సమాచారం. ఆ తర్వాతే క్యాండిడేట్లు ఎవరన్నది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ డిసైడ్ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.