ఆనందయ్య మందుపై ఉత్కంఠ.. రేపు ఐసీఎంఆర్ బృందం పరిశీలన

ఆనందయ్య మందుపై ఉత్కంఠ.. రేపు ఐసీఎంఆర్ బృందం పరిశీలన
  • మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు:ఆనందయ్య
  • ఐసీఎంఆర్ నివేదిక వచ్చాక ప్రభుత్వ సూచన మేరకు పంపిణీ: ఆనందయ్య
  • అనవసర ఆరోపణలొద్దు.. మెడికల్ మాఫియాకు లొంగే ప్రభుత్వం కాదు: ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
  • ఆయుర్వేద ఫార్మసీలో మందుల తయారీ టీటీడీ సిద్ధం..
  • కాదని తేల్చితే ఇమ్యూనిటీ బూస్టర్ గా పరిగణిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

కృష్ణపట్నం.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్. కార్పొరేట్ ఆసుపత్రుల్లో గుండె దడ పుట్టించేలా జనం నుండి అనూహ్య మద్దతు నేపధ్యంతో శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో త్వరగా పరీక్షలు చేసి నివేదిక వెంటనే వచ్చేలా చూడాలంటూ నెల్లూరు జిల్లా పెద్దాయన, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి ఆదేశాలివ్వడం కరోనా రోగులకు కొండంత స్వాంతన కలిగించిన విషయాలు తెలిసిందే. ఈ నేపధ్యంలో నిన్న శనివారం ఆయుష్ ఆయుర్వేద డిపార్టుమెంట్ పరిశీలన జరిపి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవని నిర్ధారించడం కరోనా రోగులకు.. మందుపై ఆశలు పెట్టుకున్న వారికి గొప్ప ఊరట కలిగించింది. మిగిలిన.. చిట్టచివరి అధ్యయనం రేపు అంటే  సోమవారం ఐసీఎంఆర్ బృందం ఆధ్వర్యంలో జరగనుంది. అధ్యయనం చేసేందుకు కృష్ణపట్నం వస్తున్న బృందం కోసం దేశమంతా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 
ఆయుష్ ప్రతినిధుల సమక్షంలో మందు తయారు చేసిన ఆనందయ్య
ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన సందర్బంగా ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు మీడియాతో మాట్లాడుతూ ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని గుర్తించామన్నారు. అయినప్పటికీ శాస్త్రీయత ధృవీకరణ జరిగే వరకు  ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు చెప్పారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని అన్నారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని, డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. 
సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు: ఆనందయ్య
తన మందుపై అపోహలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు ఐసీఎంఆర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చెబుతున్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మందు పంపిణీపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. అధికారికంగా ఐసీఎంఆర్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఐసీఎంఆర్ వారి ఎదుట మందు తయారు చేసి చూపించడంతోపాటు.. ఇప్పటికే చుట్టుపక్కల వారు వేయించుకున్న వారితో మాట్లాడి అందరి నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాతే ఐసీఎంఆర్ నివేదిక ఇవ్వబోతుందని ఆయన తెలిపారు. కొన్ని నెలలుగా వేల మంది ఈ మందు వాడి బాగుపడ్డారని.. చాలా మందిని ప్రత్యక్షంగా గుర్తుపట్టలేనంత భారీ స్థాయిలో మందు తీసుకున్నారని..  వారంతా తమ అనుభవాలు ఐసీఎంఆర్ కు తెలియజేస్తే నిబంధనల ప్రకారం నివేదిక వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 
మెడికల్ మాఫియాకు లొంగే ప్రభుత్వం కాదు.. ఆనందయ్య మందుపై దుష్ప్రచారం రేపొద్దు: ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆనందయ్య మందుపై అనుమానాలు రేపుతూ.. లేదా అనవసర ఆరోపణలు చేస్తూ ఎలాంటి దుష్ప్రచారం చేయవద్దని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ   మెడికల్‌ మాఫియాకు లొంగే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు కోసం జనం ఎగబడ్డారని.. పరిస్థితిని చూస్తుంటే పెద్ద ఎత్తున మందును తయారు చేయాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. భారీ సంఖ్యలో వస్తున్న రోగులకు భద్రత కల్పించే విషయంపైనే పోలీసులు మాట్లాడారే తప్ప నందయ్యను ఎవరూ అరెస్ట్‌ చేయలేదని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ నివేదిక తర్వాత ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తుందని,  ఆ తర్వాతే మందు పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 
కరోనా మందు కాదని తేల్చితే ఇమ్యూనిటీ బూస్టర్ గా పరిగణిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మశీలో మందు తయారీకి టీటీడీ సిద్ధంగా ఉందని టీటీడీ పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశఆరు. ఆదివారం ఆయన శ్రీనివాస మంగాపురంలోని ఆయుర్వేదిక్ ఫార్మసీలో వైద్యులతో సమావేశమై చర్చించారు. నిన్న ఆయుర్వేద వైద్యుల బృందం పరిశీలించిన తర్వాత ఎలాంటి దుష్ప్రభావం ఉండదని వైద్యులు తేల్చారని.. ఐసీఎంఆర్, ఆయుష్ నిబంధనల ప్రకారం వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అనుమతి వస్తే శేషాచలంఅడవుల్లో మనమూలికలు చాలా ఉన్నాయని.. ఆయన తెలిపారు. ఒకవేళ నివేదికలో కరోనా చికిత్సకు మందు కాదని నివేదిక వస్తే.. ఇమ్యూనిటీ బూస్టర్ గా పరిగణించేందుకు ఆయుష్ వైద్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ మేరకు ఆయుర్వేద ఫార్మషీలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.