హృదయం కరిగించిన ప్రేమకథ

హృదయం కరిగించిన ప్రేమకథ

గతనెల మూడో తేదీన సోషల్​ మీడియాలో ఓ పోస్టు బాగా వైరల్​ అయ్యింది. ఓ మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇటుకల బట్టీ దగ్గర నిలబడిన ఫొటో అది. (పైన కనిపిస్తున్న ఫొటో అదే). ఈ ఫొటో వెనుక గుండెను బరువెక్కించే విషాదకరమైన కథ ఉంది.

తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ పల్లెటూళ్లో భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది ప్రేమ. ఇద్దరూ ఇటుకల బట్టీలో పనిచేసేవాళ్లు. ఆ సంపాదనతో పొద్దు సాఫీగా గడిచిపోయేది. పెద్ద పిల్లాడ్ని ప్రైవేటు స్కూల్​కు కూడా పంపేవాళ్లు. అయితే ఓ రోజు భర్త ప్రేమ దగ్గరకు వచ్చి… ‘ఎన్నిరోజులు ఇలా ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేద్దాం. సొంతంగా మనమే ఇటుకల బట్టీని పెట్టుకుందాం’ అన్నాడు. అందుకు ప్రేమ కూడా సరే అన్నది. దీంతో తెలిసినవాళ్ల దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పు చేసి ఇటుకల బట్టీ పెట్టుకున్నారు. ఏడాది గడిచింది. లాభాలేమీ రాలేదు. తెచ్చిన అప్పు అలాగే ఉంది. కనీసం వడ్డీ కూడా కట్టే పరిస్థితి లేదు. నెలనెలా అసలు అలాగే ఉంటోంది. వడ్డీ పెరుగుతూ పోతోంది. దీంతో ఈ కష్టం నుంచి గట్టెక్కలేనని అనుకున్న ప్రేమ భర్త.. భార్య, పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు.

అంత్యక్రియలకూ చిల్లిగవ్వలేదు..

ఇటుకల బట్టీ దగ్గర భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన ప్రేమ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అమ్మ ఎందుకు ఏడుస్తోందో కూడా తెలుసుకోలేనంత చిన్నపిల్లలు. అమ్మ ఏడుస్తోందని వాళ్లూ ఏడ్చారు. ఇరుగుపొరుగు కలిసి భర్త శవాన్ని ఇంటికి తెచ్చారు. పోలీసులకు తెలిస్తే ఎక్కడ కేసు పెడతారోననే భయంతో అంత్యక్రియలను తొందరగా చేయాలని చెబుతున్నారు. కానీ, కనీసం భర్త అంత్యక్రియలకు కూడా ప్రేమ దగ్గర చిల్లిగవ్వ లేదు. బంధువులు కూడా పెద్దగా ఎవరూ లేరు. ఊళ్లోవాళ్లే తలో చెయ్యి వేసి అంత్యక్రియలు జరిపించేశారు.

కష్టాలు మొదలు..

భర్త ఉన్నన్ని రోజులు అప్పు ఇచ్చినవాళ్లు ఎవరో కూడా ప్రేమకు తెలియదు. కానీ భర్త చనిపోయిన తర్వాత అప్పుల వాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి పెరిగింది. వడ్డీ కాకపోయినా అసలైనా ఇవ్వాలని రోజూ గొడవపెట్టుకొని వెళ్లేవాళ్లు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ముగ్గురు పిల్లల్ని పోషించాలి, ఇంటి కిరాయి కట్టాలి, అప్పు తీర్చాలి. ఇందులో కనీసం ఏ ఒక్కటీ చేయలేని పరిస్థితి ఆమెది.

జుట్టు అమ్మి ఆకలి తీర్చింది..

అప్పటిదాకా బయట ఆడుకున్న పిల్లలు అమ్మదగ్గరకు వచ్చి ఆకలేస్తోందంటూ ఏడ్వడం మొదలుపెట్టారు. వాళ్లకు పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. కనీసం ఏదైనా అమ్మి వాళ్లకు తిండి పెడదామంటే ఒక  ప్లాస్టిక్​ బకెట్​ తప్ప ఇంకేమీ లేవు. అది అమ్మినా నాలుగైదు రూపాయలు కూడా రావు.  పిల్లల్ని ఇంట్లోనే ఉండమని చెప్పి బయటకు వెళ్లింది. వెంట్రుకలు కొనే దుకాణానికి వెళ్లి జుట్టును కత్తిరించి ఇచ్చేసింది. నూటాయాభై రూపాయలు వచ్చాయి. పక్కనే ఉన్న హోటల్​కు వెళ్లి మూడు ప్యాకెట్ల అన్నం కొనుక్కొని ఇంటికి వచ్చి పిల్లలకు పెట్టింది. అప్పటికి పిల్లల ఆకలి తీర్చడం గురించి మాత్రమే ప్రేమ ఆలోచించింది. మళ్లీ ఏడిస్తే ఇంకో పూట అన్నం మాత్రమే పెట్టగలనని ఆమెకు తెలుసు. ఆ తర్వాత? తనకూ ఆత్మహత్యే శరణ్యమనుకుంది. ఓసారి ప్రయత్నించింది కూడా. కానీ పిల్లలు గుర్తుకొచ్చి ఆగిపోయింది.

దేవుడిలా బాలమురుగన్​..

ప్రేమ వెంట్రుకలు అమ్మడాన్ని గమనించిన బాలమురుగన్ అనే వ్యక్తి… పిల్లల ఆకలి తీర్చడానికి
వెంట్రుకలు అమ్మిన విషయాన్ని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఆమెకు సాయంగా తనవంతు వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు కూడా పోస్టులో రాశాడు. దాతలెవరైనా తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తే అవి ప్రేమకు అందజేస్తానన్నాడు. బ్యాంకు ఖాతా వివరాలను పోస్టుతోపాటు అటాచ్​ చేశాడు. ఎవరూ సాయం చేయకపోయినా పొద్దున్నే వెళ్లి కనీసం వెయ్యి రూపాయలైనా ప్రేమకు ఇద్దామనుకున్నాడు.

ఒక్కరోజులో మారిన జీవితం..

This image has an empty alt attribute; its file name is balamurugan-01.jpgఏటీఎంకు వెళ్లి  తన ఖాతాలో ఎంత ఉందో బ్యాలెన్స్​ చెక్​ చేశాడు బాలమురుగన్​. బ్యాలెన్స్​ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తాను చేసిన పోస్టుకు స్పందించి ఏకంగా 36 మంది డబ్బులు వేశారు. ఒక్క రోజులోనే లక్షా 80వేల రూపాయలు రావడం మురుగన్​ నమ్మలేకపోయాడు. తాను కూడా ఇవ్వాలనుకున్న వెయ్యి రూపాయలతో కలిపి లక్షా 81వేల రూపాయలను తీసుకొని ప్రేమ ఇంటికి వెళ్లాడు. ముగ్గురు పిల్లలతో కలిసి దీనంగా కూర్చుందామె. ఆమెను బయటకు పిలిచి డబ్బులు చేతిలో పెట్టాడు. అసలు ఏం జరుగుతుందో? అతను ఎవరో? తనకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడో? ఏదీ అర్థం కావడంలేదు. జరిగిన సంగతంతా ప్రేమకు నిదానంగా చెప్పాడు మురుగన్​. దీంతో సంతోషం, బాధ, కృతజ్ఞత అన్నింటినీ కన్నీళ్ల రూపంలో బయట పెడుతూ మురుగన్​ కాళ్లమీద పడింది ప్రేమ.

ఇది చాలు.. ఇంకా సాయం వద్దు

‘‘ఇవన్నీ ఒక్కరోజులో వచ్చిన డబ్బులేనని, ఇంకా ఎవరైనా తన అకౌంట్లో డబ్బులు వేస్తే తెచ్చిస్తానని’’ చెప్పాడు మురుగన్​. దీంతో ప్రేమ అతని రెండు చేతులు పట్టుకొని.. ‘‘ఇవి చాలు… వీటితో నా అప్పు చాలావరకు తీరిపోతుంది. మిగతా అప్పును నేను కష్టపడి తీర్చుకుంటా. నా పిల్లల్ని కూడా పోషించుకుంటా. నాకు సాయం చేసిన వాళ్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు చెప్పండి. ఇంక డబ్బులు పంపించొద్దని కూడా చెప్పండి’’ అని వేడుకుంది. ఆమె చెప్పిన మాటలు విన్న బాలమురుగన్​ కూడా చాలా సంతోషపడ్డాడు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తనను కలవాలని చెప్పి వెళ్లిపోయాడు.

మళ్లీ కూలీగా..

మురుగన్​ ఇచ్చిన డబ్బుతో చాలావరకు అప్పు తీర్చేసింది. పెద్ద కొడుకును స్కూలుకు పంపించింది. ఇల్లు గడవడం కోసం మళ్లీ కూలీగా ఇటుకల బట్టీ బాటపట్టింది. రోజుకు 200 రూపాయలు సంపాదిస్తోంది. అప్పులు తీర్చడమే కాదు..తన సంపాదనతో పిల్లల కడుపు నింపుతోంది.