యువతకు ఉద్యోగాలు కావాలి... కాంగ్రెస్తోనే యువత జీవితాల్లో మార్పు: మల్లికార్జున ఖర్గే

యువతకు ఉద్యోగాలు కావాలి... కాంగ్రెస్తోనే యువత జీవితాల్లో మార్పు: మల్లికార్జున ఖర్గే
  • బిహార్‌‌లో నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్​ఎంపీ రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ: బిహార్ యువత ఊకదంపుడు ఉపన్యాసాలు కోరుకోవడం లేదని.. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కోరుకుంటున్నారని లోక్​సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. జేడీయూ బీజేపీ ప్రభుత్వం యువతను నిరుద్యోగ ఊబిలోకి నెట్టిందని, రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారిందని విమర్శించారు. ఈ సర్కార్​ నిర్వాకంతో రాష్ట్ర యువత వలస వెళ్లేలా చేసిందని.. కాంగ్రెస్, ఇండియా కూటమి ఉద్యోగ అవకాశాలతో ఈ సమస్యను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. 

శనివారం పాట్నాలో ఇండియన్ యూత్ కాంగ్రెస్(ఐవైసీ) నిర్వహించిన ‘మహా రోజ్‌‌గార్ మేళా’లో వేలాదిగా యువత పాల్గొనడం ఒక సందేశమని.. రాహుల్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీంతోపాటు మేళాకు భారీగా హాజరైన యువత వీడియోను ట్యాగ్​చేశారు.

మార్పు బిహార్ నుంచే మొదలు..

ఈ మేళాలో యువత భారీగా పాల్గొనడం బీజేపీ, దాని అవకాశవాద మిత్రపక్షాలు యువతను నిరుద్యోగంలోకి నెట్టినట్లు నిరూపిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘యువత జీవితాల్లో మార్పు బిహార్ నుంచే ప్రారంభమవుతుంది. ప్రతిభకు అవకాశాలు, ప్రతి యువతీ యువకుడికి ఉద్యోగం, వలసలను ఆపడం, కుటుంబమంతా కలిసి ఒకేచోట ఉండేలా చేయడం కాంగ్రెస్ సంకల్పం’’ అని ఆయన అన్నారు. 

శనివారం (జులై 19న) పాట్నా లోని జ్ఞాన భవన్‌‌లో యూత్​ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ మేళాలో 190 కంపెనీలు పాల్గొనగా..20 వేల మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 7 వేల మంది స్పాట్​లోనే ఆఫర్ లెటర్ 
అందుకున్నారని ఐవైసీ ఒక ప్రకటనలో తెలిపింది.