అలస్కాలో భారీ భూకంపం.. పోటెత్తిన సముద్రం..

అలస్కాలో భారీ భూకంపం.. పోటెత్తిన సముద్రం..

సోమవారం ( జులై 21 ) అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 6.2 గా నమోదైన ఈ భూకంపం వల్ల తీర ప్రాంతంలో  సముద్రం పోటెత్తింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో సునామి హెచ్చరికలు  అధికారులు ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో వెంటనే అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఉపరితలం నుంచి 48 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు వెల్లడించింది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ. 

భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నేషనల్ వెదర్ సర్వీస్.. సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఆ తరువాత ఈ హెచ్చరికను ఉపసంహరించుకొని..  అడ్వైజరీగా ప్రకటించింది. అలస్కాలో ప్రాంతంలో భూకంపం రావడం వారంలో ఇది రెండోసారి. జులై 17న 7.3 తీవ్రతతో భూమి కంపించింది. నాలుగు రోజుల వ్యవధిలో 6కు పైగా తీవ్రతతో భూకంపం సంభవించడాన్ని సీరియస్ గా భావిస్తున్నారు జియాలజిస్టులు.

ఇదిలా ఉండగా.. ఆదివారం ( జులై 20 ) రష్యాను భూకంపం వణికించింది. గంట వ్యవధిలోనే ఐదు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.4 తీవ్రత నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్​జీఎస్) ప్రకటించింది. పసిఫిక్​ సముద్ర తీర ప్రాంతంలోనే భూమి కంపించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో రష్యాలోని కమ్చట్కా ఐలాండ్​కు, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు ‘పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం’ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 

భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. నాలుగు భూకంప కేంద్రాలు భూమి పైనుంచి సుమారు 10 కిలో మీటర్లలోతులోనే ఉన్నట్లు వివరించారు. 7.4 తీవ్రతతో భూమి కంపించినప్పుడు మాత్రం దాని కేంద్రం 20 కిలో మీటర్ల లోతులో గుర్తించారు.  రిక్టర్​స్కేలుపై 6 తీవ్రత ఉన్నంత వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఎప్పుడైతే తీవ్రత 7 దాటిందో అప్పుడు తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు.