
- 15 ఏండ్ల వయసులో యాక్సిడెంట్, అప్పటి నుంచి వెంటిలేటర్ మీదే యువరాజు
- 36 ఏండ్ల వయసులో తుదిశ్వాస
- రియాద్‌లోని మసీదులో ఇయ్యాల అంత్యక్రియలు
రియాద్: ఇరవై ఏండ్లుగా కోమాలో ఉన్న సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్ ఆదివారం కన్నుమూశారు. గ్లోబల్ ఇమామ్‌ల కౌన్సిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అల్ వలీద్ తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా తన కొడుకు మృతిని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘దైవ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే. మరణం ఎప్పుడు రావాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఈ రోజు మా ప్రియ కుమారుడిని కోల్పోయాం” అని ట్వీట్ చేశారు.
గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసింది. ‘‘యువరాజు అల్ వలీద్ 20 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించారు. ఈ విషాద ఘటన నుంచి ఆయన కుటుంబం త్వరగా కోలుకునేందుకు తగిన శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం” అని పేర్కొంది. రియాద్‌లోని ఇమామ్ తుర్కిబిన్ అబ్దుల్లా మసీదులో ప్రార్థన తర్వాత
అల్ వలీద్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
యువరాజుకు ఏమైందంటే..
1990 ఏప్రిల్‌లో పుట్టిన ప్రిన్స్ అల్ వలీద్ ప్రస్తుత సౌదీ ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కొడుకు. అల్ వలీద్ లండన్‌లోని ఆర్మీ కాలేజీలో చదువుతున్నప్పుడు 2005లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. యాక్సిడెంట్‌లో యువరాజు తీవ్రంగా గాయపడగా లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆపై అల్ వలీద్‌ను సౌదీ రాజధాని రియాద్‌లోని ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి వెంటిలేటర్, లైఫ్ సపోర్ట్ మీదున్న అల్ వలీద్ 20 ఏండ్లుగా కోమాలోనే ఉన్నారు.
కోలుకునే అవకాశంలేదని భావించి 2015లోనే లైఫ్ సపోర్ట్ తీసేద్దామని డాక్టర్లు సూచించినప్పటికీ ఆయన తండ్రి అందుకు ఒప్పుకోలేదు. అనంతరం 2019లో ప్రిన్స్ అల్ వలీద్ కాస్త కోలుకున్నట్లు కనిపించారు. చేతి వేళ్లు కదపడం, తల కదిలించడంతో ఆయన మళ్లీ మామూలు మనిషవుతారని రాచకుటుంబీకులు భావించారు. సోషల్ మీడియాలోనూ స్లీపింగ్ ప్రిన్స్ తిరిగి కోలుకోవాలంటూ పోస్టులు వెల్లువెత్తాయి. కానీ, ఆపై యువరాజు ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం 36 ఏండ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.