
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఇటీవల ముగిసిన 17వ బ్రిక్స్ సదస్సు, అంతర్జాతీయ వేదికలు భారతదేశ ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తున్నాయనే చర్చకు తెరలేచింది. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో ఏర్పడిన బ్రిక్.. అనంతరం 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్(బీఆర్ఐసీఎస్)గా మారింది. వేగంగా మారుతున్న ప్రపంచ వ్యవస్థలో బ్రిక్స్‌తో సహా అంతర్జాతీయ వేదికలు భారతదేశ ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను బలోపేతం చేయడంలో ఎంతవరకు దోహదపడుతున్నాయనే ప్రశ్న కీలకంగా మారుతోంది.
అయితే, పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు బహిరంగంగా దౌత్యపరంగా అండగా నిలవలేదు. దీంతో భారత విదేశాంగ విధానంపై సందేహాలు రేకెత్తాయి. మోదీ హయాంలో భారత దౌత్య వ్యూహం బలహీనపడిందనే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో బ్రిక్స్ వంటి సదస్సులతో ఒరిగేది ఏమిటనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈనేపథ్యంలో బ్రిక్స్ భారతదేశానికి అందించే అవకాశాలు, సవాళ్లను పరిశీలిద్దాం. బ్రిక్స్...అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ వంటి పాశ్చాత్య ఆధిపత్య సంస్థలలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ, అంతర్జాతీయ సమతుల్యతను సాధించే లక్ష్యంతో ఏర్పడింది. భారతదేశం ఈ వేదికలో చురుకైన సభ్య దేశంగా, గ్లోబల్ సౌత్ దేశాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు పాటుపడుతోంది.
2025 జులై మొదటివారంలో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు ఈ కాలం అవసరాలను ప్రతిబింబించాలని గట్టిగా వాదించారు.
భారతదేశానికి బ్రిక్స్ఊతం
బ్రిక్స్ భారతదేశానికి బహుముఖ అవకాశాలను అందిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడానికి ఈ వేదిక శక్తిమంతమైన సాధనంగా పనిచేస్తోంది. బ్రెజిల్ రియో సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్... బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా ఆర్థిక మంత్రులతో సమావేశమై చర్చలు జరిపారు. వాణిజ్యం, సాంకేతిక సహకారం, ఆర్థిక భాగస్వామ్యంపై ఆ దేశాలతో విస్తృతంగా చర్చలు జరిపారు.
2026లో బ్రిక్స్ ఛైర్మన్‌షిప్‌ను స్వీకరించనున్న భారతదేశం, సమ్మిళిత అభివృద్ధి, గ్లోబల్ సౌత్ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చే ఎజెండాను రూపొందించనుంది. స్థానిక కరెన్సీలలో వాణిజ్యం, డిజిటల్ రూపాయి, బ్రిక్స్ పే వంటి ఆర్థిక ఆవిష్కరణలు భారత ఆర్థిక సంస్కరణలకు ఊతమిస్తున్నాయి. కానీ, మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్, -పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో బ్రిక్స్ సభ్యదేశాల నుంచి మద్దతు లభించకపోవడం భారత విదేశాంగ విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది.
బ్రిక్స్ దేశాలు భారత భద్రతా ఆందోళనలపై నిశ్శబ్దం వహించడం, తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ వేదికల పరిమితులను బయటపెడుతోంది. బ్రిక్స్ ఆర్థిక సహకారంలో విజయవంతమైనప్పటికీ, భద్రతా విషయాల్లో భారతదేశానికి ఆశించిన మద్దతు అందించలేకపోతోంది.
చైనా ఆర్థిక ఆధిపత్యం
చైనా ఆర్థిక ఆధిపత్యం బ్రిక్స్‌లో భారత ప్రభావాన్ని పరిమితం చేస్తోంది. చైనా జీడీపీ భారత జీడీపీ కంటే ఐదురెట్లు ఎక్కువ కావడంతో, డి-డాలరైజేషన్, సభ్యదేశాల విస్తరణ వంటి చైనా ఎజెండాలు బ్రిక్స్ చర్చలను ఆధిపత్యం చేస్తున్నాయి. రష్యా, చైనా డి-డాలరైజేషన్‌ను గట్టిగా సమర్థిస్తుండగా, భారతదేశం బహుళ కరెన్సీల ఆధారిత వ్యవస్థను సమర్థిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై అదనపు సుంకాల హెచ్చరికలు భారత దౌత్య సమతుల్యతను పరీక్షిస్తున్నాయి. మారుతున్న ప్రపంచ వ్యవస్థలో బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలు భారతదేశానికి గణనీయ అవకాశాలను అందిస్తున్నాయి. గ్లోబల్ సౌత్‌లో నాయకత్వ బాధ్యతలు, ఆర్థిక సహకారం, అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణల ఒత్తిడి వంటి అంశాల్లో ఈ వేదికలు బలమైన సాధనంగా నిలుస్తున్నాయి. అయితే, పహల్గాం దాడి సందర్భంగా బ్రిక్స్ దేశాల నుంచి మద్దతు లభించకపోవడం, చైనా ఆధిపత్యం, అంతర్గత వైరం, బాహ్య ఒత్తిళ్లు భారత లక్ష్యాల సాధనలో అడ్డంకులుగా ఉన్నాయి.
భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
బ్రిక్స్ వేదిక భారత్‌కు ఆర్థిక, వ్యూహాత్మక అవకాశాలు కల్పిస్తున్నా, భద్రతా అంశాల్లో మద్దతు లేకపోవడం ఒక నిశ్శబ్ద దౌత్య పరాజయం అని భావించవచ్చు. అయితే, ఇది ఒక దౌత్యపరమైన పరిమితి మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ప్రయోజనాలే నిర్ణయాత్మకంగా మారతాయి, సానుభూతి కాదు. ఇది భారత్‌కు ఒక హెచ్చరికే. 2026లో బ్రిక్స్ చైర్మన్‌షిప్‌ను స్వీకరించే సమయంలో భారతదేశం తన వ్యూహాత్మక దృష్టితో వ్యవహరించాలి.
బ్రిక్స్ సంస్థను మరింత సమ్మిళితంగా మార్చడంతోపాటు, భద్రతా ఆందోళనలపై సభ్యదేశాల మద్దతు సాధించే దిశగా కృషి చేయాలి. ఈ వేదికలు అవకాశాలను అందిస్తూనే, వాటిలోని సంక్లిష్టతలను నిర్వహించడం భారత దౌత్య నైపుణ్యానికి సవాలుగా నిలుస్తోంది. ఈ సవాళ్లను అధిగమించి, బ్రిక్స్‌ను గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకు బలమైన గొంతుకగా మార్చడం భారతదేశం ముందున్న లక్ష్యం.
-శ్రీనివాస్ గౌడ్ ముద్దం, సోషల్ ఎనలిస్ట్-