రైతులను లంచం అడిగితే ఉరిశిక్ష!

రైతులను లంచం అడిగితే ఉరిశిక్ష!

మద్రాస్ హైకోర్టు మధురై డివిజన్ బెంచ్ న్యాయమూర్తుల సంచలన వ్యాఖ్యలు

చెన్నై: రాష్ట్రంలో ప్రభుత్వ గోదాముల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి రైతుల నుంచి లంచమడిగే అధికారులకు ఉరిశిక్ష విధించాలని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం కౌంటర్ ఆఫిడవిట్ లో ఓవైపు అవినీతికి అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని చెబుతూనే.. 105 మంది అధికారులపై చర్యలు తీసుకున్నామన్న వివరణ పట్ల హైకోర్టు న్యాయమూర్తులు అభ్యంతరం తెలిపారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందో వివరాలేమీ తెలపకుంటే ఎలా అని ప్రశ్నించారు.

రైతుల నుంచి వరి ధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వపరంగా అవసరమైనంత మేరకు కొనుగోలు కేంద్రాలు, గోదాముల సదుపాయం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన సూర్య ప్రకాశం అనే ప్రముఖుడు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ లో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు కృపాకరన్‌, పుగళేంది ఈ విషయమై ప్రభుత్వం సమగ్రమైన నివేదికను కౌంటర్‌ అఫిడ విట్‌గా సమర్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఈ పిటిషన్‌ విచారణకు రాగా రాష్ట్ర వినియోగదారుల వాణిజ్య మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాదేవి కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 862 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని, అదనంగా మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నదని పేర్కొన్నారు.  అదే సమయంలో రైతుల వద్ద గోదాముల కోసం అధికారులు ఎవరూ లంచం అడగటం లేదని, అవకతవకలకు పాల్ప డ్డారనే ఆరోపణలపై 105 మంది అధి కారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఈ నివేదికలోని అంశాలను పరిశీలించిన న్యాయమూర్తులు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, గోదాముల వద్ద అధికారులు లంచం తీసుకోవడం లేదని చెబుతూనే అవినీతికి పాల్పిడిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలుపడం విడ్డూరంగా.. వింతగా ఉందన్నారు. అధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో నివేదికలో స్పష్టం చేయలేదని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సవ్యంగా ధాన్యం కొనుగోళ్లు జరిగివుంటే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. రేయింబవళ్లు శ్రమించి పంటలు పండించే రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక, వాటిని నిల్వ చేసుకునేందుకు గోదాములు లేక తీవ్ర ఇబ్బం దులకు గురువుతున్నారని, ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న అన్నదాతల నుంచి లంచం తీసుకునే అధికారులకు ఉరిశిక్ష విధించాలని న్యాయ మూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతికి పాల్పడిన 105 మంది అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు మరో నివేదిక ద్వారా స్పష్టపరచాలని ప్రభుత్వానికి ఉత్తర్వు జారీ చేసి, కేసు తదుపరి విచారణను ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు.