
- స్కీమ్ అమలు చేసేందుకు నిధుల్లేవ్
- ఇప్పట్లో ఎన్‌సీడీసీ లోన్ వచ్చేది డౌటే
- రూ.4,563.75 కోట్ల లోన్‌పై ఆశలు గల్లంతు
- రూ. 1,000 కోట్లైనా ఇవ్వాలని లెటర్ రాసినా నో యూజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి కసరత్తు షురూ చేసిన పశు సంవర్ధక శాఖకు నిధులు అందక డైలమాలో పడిపోయింది. రాష్ట్ర సర్కారు రెండో విడత గొర్రెల పంపిణీ కోసం పైసా కేటాయించక పోవడంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(ఎన్‌సీడీసీ) ద్వారా లోన్ తీసుకుని గొర్రెల పంపిణీ చేపట్టాలని పశు సంవర్ధక శాఖ భావించింది. కానీ లోన్ ఇవ్వడానికి ఎన్‌సీడీసీ సుముఖంగా లేదు. కనీసం రూ.1,000 కోట్ల నిధులైనా ఇవ్వాలని ఎన్‌సీడీసీకి పశు సంవర్ధక శాఖ లెటర్ రాసినా ఫలితం లేకపోయింది. దీంతో లోన్‌పై నేటికీ స్పష్టత రాకపోవడం, మరోవైపు రాష్ట్ర సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో గొర్రెల పంపిణీ ఎలా అని పశు సంవర్ధక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు లబ్ధిదారుల నుంచి వాటాగా సేకరించిన రూ.350 కోట్లతోనే గొర్రెలను కొని.. కనీసం 20 వేల యూనిట్లను అయినా ఎన్నికల టైం వరకు పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికలతో మళ్లీ తెరపైకి
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో మరోసారి గొర్రెల పంపిణీ వ్యవహారం తెరపైకి వస్తోంది. ఆయా సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ సమాయత్తమైంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కురుమ, గొల్ల సామాజిక వర్గాలకు గొర్రెల పథకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. యానిమల్ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్ అధికారులు లబ్ధిదారుల నుంచి 25% వాటా నిధుల సేకరణ షురూ చేశారు. ఒక్కో యూనిట్‌కు కేటాయించిన రూ.1.75 లక్షల్లో లబ్ధిదారుల వాటాను రూ.43,750గా నిర్ణయించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 80 వేలకుపైగా లబ్ధిదారులు తమ వాటా నిధులను చెల్లించారు. ఈ లాబ్ పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలను రిజిస్టర్ చేస్తున్నారు. డబ్బులను డీడీల రూపంలో కాకుండా ఈ లాబ్ పోర్టల్‌లో రిజిస్టరైన వర్చువల్ అకౌంట్‌లో ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గొర్రెల కొనుగోళ్లు, పంపిణీకి గైడ్ లైన్స్ పైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మొదటి విడత పైసలు మిగిలినయ్
మొదటి విడత గొర్రెల పంపిణీలో రూ.300 కోట్లకు పైగా నిధులు ఇంకా మిగిలే ఉన్నాయి. రెండో విడతపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో పశు సంవర్థక శాఖ వెంటర్నరీ అధికార యంత్రాగాన్ని సమాయత్తం చేస్తోంది. వివిధ జిల్లాల నుంచి మెదటి విడతలో మిగిలిన నిధులను తిరిగి డిపార్ట్‌మెంట్ హెడ్ ఆఫీస్‌కు వాపస్ చేయిస్తున్నారు. ఈ మిగిలిన నిధులతో కొన్ని యూనిట్లు ఇచ్చే అవకాశాలపై ఇటీవల ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వడంతో , జిల్లా అధికారులు వాటిని పంపిణీ ప్రక్రియ చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెలాఖరు వరకు 10 వేల మందికి ఇస్తామని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఇటీవల జీఎంపీఎస్ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో హామీ ఇచ్చారు.
ఎన్‌సీడీసీ లోన్ డౌటే
రెండో విడత గొర్రెల పంపిణీకి లోన్ అందించేందుకు ఎన్‌సీడీసీ గతంలో అంగీకారం తెలిపింది. గత జూన్‌లోనే రూ.4,563.75 కోట్ల రుణాలిచ్చేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో పశు సంవర్థక శాఖ రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది. సర్కారు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ ఇంతలో సీన్ రివర్స్ అయింది. లోన్ మంజూరుకు ఎన్‌సీడీసీ ఇటీవల అనుమతించలేదు. దీంతో రెండో విడత కోసం ఎదురు చూస్తున్న 3.50 లక్షల మంది గొల్ల, కురుమలకు యూనిట్ల పంపిణీపై అయోమయం నెలకొంది. సర్కారు ఆర్థికంగా సహకరించి గొర్రెల పంపిణీ చేపడుతుందని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు గొర్రెల పంపిణీపై క్లారిటీ రావడంలేదు.
రూ.6,085 కోట్లు కావాలె
రెండో విడతలో 3.5 లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉండగా, ఇందుకు రూ.6,085 కోట్ల నిధులు అవసరమవుతాయని యానిమల్ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. మొత్తం 3.50 లక్షల యూనిట్ల కు లబ్ధిదారుల వాటా కింద వారి నుంచి రూ.1,521.25 కోట్లను సేకరిస్తున్నారు. లబ్ధిదారుల వాటా పోగా మరో రూ.4,563.75 కోట్ల నిధులు అవసరం ఉంటుంది. ఎన్‌సీడీసీ నిధులు రానందున 80 వేల మంది లబ్ధిదారులు చెల్లించిన నిధులతోనే గొర్రెల యూనిట్లు పంపిణీ చేసి మిగతా వాటి పంపిణీ ఎన్నికలు అయ్యాక చూడొచ్చని సర్కారు పెద్దలు యోచిస్తున్నట్లు తెలిసింది. లబ్ధిదారుల నుంచి సేకరించిన రూ.350 కోట్ల నిధుల్లో కొంత ఖర్చు చేసి రెండో విడత కింద కనీసం 20 వేల యూనిట్ల ను పంపిణీ చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.