
చండ్రుగొండ, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో రూ.11.70 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. మద్దుకూరు, దామరచర్ల, అయ్యన్నపాలెం, చండ్రుగొండ, బెండాలపాడు, రావికంపాడు, పోకలగూడెం, గానుగపాడు, రేపల్లెవాడ గ్రామాల్లో పర్యటించారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆయా గ్రామాల్లో రూ.26 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, రూ.8లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చండ్రుగొండ లో షాదీఖానా మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మండలానికి ఎస్టీ కోటా ద్వారా అదనంగా 128 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. రూ.100 కోట్లతో దమ్మపేటలో మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించి మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేసి ఆర్థికంగా స్థిర పడేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్ , పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తాపీ మేస్త్రీగా మారిన ఎమ్మెల్యే
మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. వంకనెంబరు గ్రామంలో తాపీ మేస్త్రీగా మారి ఇంటి గోడను కట్టారు.