బయో వెపన్స్​ను ఎదుర్కోవడంపై కసరత్తు

బయో వెపన్స్​ను ఎదుర్కోవడంపై కసరత్తు
  • అటు సైనిక యుద్ధం.. ఇటు బయో వార్​కూ సన్నద్ధత
  • విదేశాల నుంచి వచ్చేటోళ్లకు స్ట్రిక్ట్ గా క్వారంటైన్ రూల్స్

తైపీ: తైవాన్ జలసంధిలో చైనా దూకుడు యుద్ధానికి దారితీయొచ్చని తైవాన్​ ఆందోళన చెందుతోంది. బయోవార్​భయంతో ముందు జాగ్రత్తలు చేపట్టింది. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందన్న ఆరోపణలు వచ్చినందున తమ దేశంపై వైరస్ ను లేదా ప్రమాదకరమైన బ్యాక్టీరియాను డ్రాగన్ ప్రయోగించే అవకాశం ఉందని అనుమానిస్తోంది. దీంతో చైనా అటు సైనికులతో యుద్ధానికి దిగినా, ఇటు బయోవార్ కు దిగినా ధీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్ లో పర్యటించిన తర్వాత చైనా దూకుడు పెంచడం, తైవాన్ జలసంధిలో భారీ ఎత్తున విన్యాసాలు చేపట్టడంతో టెన్షన్​ నెలకొంది. ఇప్పటికే మిలిటరీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని, డ్రిల్స్ చేపట్టింది. దేశం చుట్టూ నిఘాను పెంచింది. యుద్ధం మొదలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించింది. తాజాగా బయోవార్ ను ఎదుర్కోవడంపైనా ఆ దేశం దృష్టి సారించింది.

కరోనాను మించి జాగ్రత్తలు.. 

సుమారు రెండున్నర కోట్ల జనాభా ఉన్న తైవాన్ లో ఇప్పటివరకూ కరోనా కేసులు 50 లక్షలలోపు, మరణాలు 9,500 వరకూ నమోదయ్యాయి. వైరస్ ను బాగా కట్టడి చేసిన దేశంగా తైవాన్ గుర్తింపు తెచ్చుకుంది. కరోనా తీవ్రత తగ్గడంతో ఇప్పుడు అన్ని దేశాలూ కరోనా గైడ్ లైన్స్ ను సడలిస్తూ పోతుంటే.. తైవాన్ మాత్రం మళ్లీ రూల్స్ స్ట్రిక్ట్ చేసింది. చైనా బయోవార్ కు దిగొచ్చన్న ఆందోళనతో కరోనాకు మించి గైడ్ లైన్స్ ను పక్కాగా అమలు చేస్తోంది. విదేశాల నుంచి వైరస్ లు వ్యాపించకుండా ఉండేందుకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దిగుమతులనూ బ్యాన్ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ క్వారంటైన్ రూల్స్ తప్పనిసరి చేసింది. విమానం దిగినప్పటి నుంచి క్వారంటైన్ పూర్తి అయ్యే వరకూ వైరస్ ఎక్కడా వ్యాప్తి చెందకుండా, ఆయా వ్యక్తులు ఇతరులను నేరుగా కాంటాక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సెల్ఫ్ టెస్టింగ్ కిట్ లు, ఇతర అన్ని సౌలతులు అందిస్తూ, ఎయిర్ పోర్టు సిబ్బంది పక్కాగా మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మళ్లీ బార్డర్ దాటిన చైనా జెట్ లు 

చైనా మళ్లీ తైవాన్ జలసంధిలోని మీడియన్ లైన్ ను దాటి తైవాన్ జలాల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఏకంగా 21 వార్ ప్లేన్ లు, 5 షిప్ లతో చైనా హంగామా చేసిందని, వీటిలో 8 ఫైటర్ జెట్ లు బార్డర్ దాటి వచ్చాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. బార్డర్ దాటిన వాటిలో నాలుగు బాంబర్లు, రెండు సుఖోయ్ లు, మరో రెండు షెన్యాంగ్ జెట్ లు ఉన్నాయని తెలిపింది. రెండు జెట్ లు ఉత్తరాదిన, మరో రెండు జెట్ లు దక్షిణాదిన చక్కర్లు కొట్టాయని పేర్కొంది. అంతకుముందు రోజు కూడా జలసంధిలో 51 చైనీస్ యుద్ధవిమానాలు ఎగిరినట్లు గుర్తించామని చెప్పింది.

‘బ్యాక్టీరియా’ బాంబులు వేసినా.. 

బ్యాక్టీరియా బాంబులతో దాడి చేస్తే ఎదుర్కొనేందుకు మిలిటరీలో స్పెషల్​ టీమ్​లను ఏర్పాటు చేసి, రక్షణ శాఖ ఆధ్వర్యంలో తైవాన్​ ప్రత్యేకంగా ట్రెయినింగ్​ ఇప్పిస్తోంది. బయోవెపన్ లను ప్రయోగిస్తే.. ఆ ప్రాంతాన్ని, వెహికల్స్ ను జీవాయుధ రహితం చేసేందుకూ సన్నద్ధమవుతోంది. ఒకవేళ రసాయన దాడులు చేసినా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా కెమికల్ గ్రూప్ ను సిద్ధం చేసింది.