డిసెంబర్ 15 నుంచి ఫ్యాప్సీ భవన్​లో పాత నాణేలు, స్టాంపుల ప్రదర్శన

డిసెంబర్ 15 నుంచి ఫ్యాప్సీ భవన్​లో పాత నాణేలు, స్టాంపుల ప్రదర్శన

బషీర్​బాగ్, వెలుగు: చరిత్ర, పురాతన అంశాలు, మన పూర్వీకుల జీవన విధానంపై స్టూడెంట్లు, యువతకు అవగాహన కల్పించేందుకు ఫిలాటెలిక్‌ అండ్‌ హాబీస్‌ సొసైటీ నిర్వాహకులు హైపెక్స్  డైమండ్–- 2023 పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి సాగి శ్రీనివాస్ రాజు తెలిపారు. మంగళవారం  హైదర్​గూడలోని ఎన్ఎస్ఎస్​లో హైపెక్స్ డైమండ్–2023కి సంబంధించిన పోస్టర్​ను ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ.. 1961లో ఏర్పడిన ఫిలాటెలిక్ సంస్థ  ఇప్పటివరకు వందల కొద్దీ ప్రదర్శనలు  నిర్వహించిందని వివరించారు. 

పాత నాణేలు, స్టాంపులను సేకరించే అభిరుచి కలిగిన ఎంతో మందిని  ఒక వేదిక మీదకు  తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాణేల సేకరణ అభిరుచి కలిగిన వ్యక్తులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో వందల ఏళ్ల నాటి  నాణేలు, స్టాంపులను చూడటమే కాకుండా ఆసక్తి ఉన్న వారు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి17 వరకు నాంపల్లి రెడ్ హిల్స్​లోని ఫ్యాప్సీ భవన్‌లో ఈ ప్రదర్శన  నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.