రాజస్థాన్​లో బీజేపీదే హవా .. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ వెనుకంజ

రాజస్థాన్​లో  బీజేపీదే హవా ..  ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ వెనుకంజ

న్యూఢిల్లీ:  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పట్లాగే ఓటర్లు ఈసారి కూడా ప్రభుత్వాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..  కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి బీజేపీ గద్దెనెక్కనుందని తెలుస్తోంది. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఓటర్లు ప్రతిసారీ ప్రభుత్వాన్ని మారుస్తున్నారు. ఈసారి కూడా ఈ ఆనవాయితీని కొనసాగించనున్నారని, బీజేపీకి అధికారం కట్టబెట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 

రాష్ట్రంలోని మొత్తం 200 అసెంబ్లీ సీట్లలో 199 సీట్లకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. కరణ్​పూర్ స్థానంలో ఎమ్మెల్యే గుర్మీత్ కూనర్ పోలింగ్​కు ముందు చనిపోవడంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ 101 సీట్లు కాగా.. 8 సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ మెజార్టీ మార్కును దాటనుందని తేలింది. కాంగ్రెస్ మెజార్టీ మార్క్ ను దాటనున్నట్లు 3 సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వెల్లడించాయి. 

దీంతో రాష్ట్రంలో అశోక్  గెహ్లాట్ ప్రభుత్వం గద్దె దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లను గెలుచుకుని, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ 73 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది.