
- అంతకంటే ముందే పీసీసీ చీఫ్ నియామకం
- నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ
- వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు
- హైకమాండ్‌తో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
- ఇయ్యాల సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరు
- కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్.. హాజరుకానున్న రేవంత్, రాష్ట్ర ఎంపీలు
హైదరాబాద్, వెలుగు: త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని తెలుస్తున్నది. మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశముంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నేతల సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ బెర్త్‌లను భర్తీ చేసే చాన్స్ ఉంది. ఈ అంశాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించి, గ్రీన్ సిగ్నల్ తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.
శనివారం అక్కడ జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లోనూ ఆయన పాల్గొంటారు. కాగా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలకు శనివారం డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు పాల్గొననున్నారు.
ముందు నామినేటెడ్ పోస్టులు..
పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ కంటే ముందు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 54 కార్పొరేషన్లకు చైర్మన్ల లిస్టు ఇప్పటికే సిద్ధమైంది. దానికి పార్టీ హైకమాండ్ ఆమోదించిన తర్వాత ప్రకటించనున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వాటిపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిల్లో పలు మార్పుచేర్పులు చేసిన సీఎం.. ఈ జాబితాకు తోడు మిగిలిన 17 కార్పొరేషన్లకు చైర్మన్ల పేర్లతో పాటు మెంబర్లను కూడా ఖరారు చేశారు. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలిసి తమకు మంత్రి పదవి ఇవ్వని పక్షంలో కనీసం కీలకమైన కార్పొరేషన్‌చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని కోరుతున్నారు.
సీఎం టూర్ తర్వాతే క్లారిటీ..
సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ తర్వాతే కేబినెట్‌విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర కేబినెట్ లో మొత్తం 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. అంటే మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. వీటి భర్తీలో ఇప్పటి వరకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని జిల్లాలను, ఎమ్మెల్యేల సీనియారిటీని, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉంది. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మంచి మెజార్టీ తెప్పించిన ఎమ్మెల్యేల పనితీరును ప్రామాణికంగా తీసుకోవచ్చు.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి త్వరలోనే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. చేరేవాళ్ల స్థాయిని బట్టి ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ సాగుతున్నది. ఇక ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీగణేశ్ ఇటీవల గెలిచారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మల్ రెడ్డి రంగారెడ్డి( ఇబ్రహీంపట్నం), మనోహర్ రెడ్డి ( తాండూర్), రామ్మోహన్ రెడ్డి (పరిగి) ఉన్నారు.
వీరిలో మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు బాగా ప్రచారంలో ఉంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.
పీసీసీ చీఫ్ పోస్టు ఎవరికి దక్కెనో?
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మూడేండ్ల పదవీకాలం ఈ నెల 27తో పూర్తి కానుంది. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పదవిని భర్తీ చేయనున్నారు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం పార్టీలో పోటీ ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలో అది ఎవరికి దక్కుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.