ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేర్చేలా టీశాట్​ విస్తరణ : వేణుగోపాల్​రెడ్డి

 ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేర్చేలా టీశాట్​ విస్తరణ :   వేణుగోపాల్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు :   తెలంగాణ స్కిల్, అకాడమిక్ అండ్ ట్రైనింగ్ (టీశాట్ ) నెట్ వర్క్ చానల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా  సీనియర్ జర్నలిస్టు బోదనపల్లి వేణుగోపాల్​రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్​రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్​లోని ప్రధాన కార్యాలయంలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన  వేణుగోపాల్​రెడ్డి మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్  శ్రీధర్ బాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశగా టీశాట్ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ చానళ్లలో టీశాట్ ను నెంబర్ వన్ స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇప్పటికే అకడమిక్, కాంపిటేటివ్ అంశాల్లో అందిస్తోన్న సేవలను మరింత విస్తృతపర్చడంతో పాటు, విద్య, వైద్యం, వ్యవసాయం, శాస్త్ర, సాంకేతికత తదితర రంగాల్లోకి టీశాట్ నెట్ వర్క్ ను తీసుకెళ్తామన్నారు.