సిగాచికి నిపుణుల కమిటీ ప్రమాద ఘటనపై ఆరా

సిగాచికి  నిపుణుల కమిటీ ప్రమాద ఘటనపై ఆరా
  • మిషనరీ విడి భాగాలు, పలు శాంపిళ్ల సేకరణ 

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీని నిపుణుల కమిటీ బృందం గురువారం పరిశీలించింది. పేలుడు ఘటనపై కమిటీ చైర్మన్ బి.వెంకటేశ్వర రావు, సభ్యులు డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, సంతోష్ ఫ్యాక్టరీకి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేలుడు తీవ్రత,  ప్రాణ, ఆస్తి నష్టంపై ఆరా తీశారు. దాదాపు 3 గంటల పాటు సిగాచి ఫ్యాక్టరీలో తిరిగారు. పేలుడుకు ప్రధాన కారణమేంటని అడిగారు.

కొన్ని మిషనరీకి సంబంధించిన విడి భాగాలను, పలు శాంపిల్స్​ను సేకరించి తమ వెంట తీసుకెళ్లారు. ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు రాష్ట్ర సర్కార్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమగ్ర విచారణ జరిపి నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. బుధవారమే కమిటీ చైర్మన్, సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. గురువారం ఫ్యాక్టరీని పరిశీలించారు.