
- పదో గేట్ వద్ద లీకేజీతో ఇప్పటికైతే ప్రమాదం లేదు
- గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు
శ్రీశైలం, వెలుగు : మరో ఐదేండ్లలో శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను తప్పనిసరిగా మార్చాల్సిందేనని గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు స్పష్టం చేశారు. లేకపోతే గతేడాది తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయినట్లే శ్రీశైలం వద్ద కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివారం మధ్యాహ్నం ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించి క్రస్ట్ గేట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ పదో నంబర్ గేటు వద్ద నీరు లీక్ అవుతోందన్నారు.
లీక్ అవుతున్న నీరు పది శాతం కంటే తక్కువగా ఉండడంతో ప్రమాదం లేదన్నారు. 2010లో గేట్లకు పెయింటింగ్ వేసి, మళ్లీ ఇప్పటివరకు వేయలేదన్నారు. ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి 40 ఏండ్లు అవుతోందని, మరో ఐదేండ్లలో ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రస్ట్‌గేట్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. అలాగ్ డ్యామ్ దిగువన ఏర్పడిన ఫ్లంజ్ పూల్ వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.