Gold News: రూ.90వేల కిందికి తులం గోల్డ్ రేటు పడనుందా..? డైలమా వద్దు నిపుణుల మాట ఇదే..

Gold News: రూ.90వేల కిందికి తులం గోల్డ్ రేటు పడనుందా..? డైలమా వద్దు నిపుణుల మాట ఇదే..

Gold Price Drop: 2025 స్టార్టింగ్ నుంచి పసిడి ధరలు ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆందోళలతో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రధానంగా జనవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెలలో ప్రకటించిన వాణిజ్య సుంకాలు దీనికి ఆజ్యం పోశాయి. కొన్ని వారాల కింద వరకు గోల్డ్ రేట్లు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిల్లో పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకి ప్రజలను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పసిడి ధరల పతనంపై అందరి చూపు కొనసాగుతోంది.

* ఒకవేళ పసిడి ధరలు మరింతగా తగ్గితే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దేశీయ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీకి చెందిన నిపుణులు మనీష్ శర్మ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గతవారంలో స్పాట్ మార్కెట్లో పసిడి ధరలు 3 శాతం తగ్గి ఔన్సుకు 3వేల 120 డాలర్ల స్థాయికి తగ్గాయి. చైనా-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కింద సుంకాలను ఇరుదేశాలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించటం సెంటిమెంట్లను మెరుగుపరిచాయి. ఇది పసిడి ధరలను తగ్గించటంలో దోహదపడింది.

* అమెరికా క్రెడిట్ రేటింగ్ ను ప్రముఖ సంస్థ మూడీస్ Aaa నుంచి Aa1కి తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఎస్ పై ఉన్న రుణాల భారంతో పాటు పెరుగుతున్న వడ్డీ చెల్లింపుల ఒత్తిడిని రేటింగ్ తగ్గింపులకు కారణంగా వెల్లడించింది. దీనికి ముందు ఫిచ్ రేటింగ్స్, ఎస్అండ్ పి కూడా రేటింగ్ తగ్గించిన సంగతి తెలిసిందే. 2035 నాటికి అమెరికా జీడీపీలో రుణ భారం 134 శాతానికి పెరుగుతుందని మూడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను చెల్లింపులు తగ్గిపోవటమే దీనికి కారణంగా చెప్పబడింది. 

గోల్డ్ రేటులపై నిపుణుల అంచనా ఇలా..
అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనలు ఈవారం వరకు పసిడి ధరలను ప్రభావితం చేశాయి. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఏడాది చివరి నాటికి మరోసారి వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించవచ్చని తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ లోపు ఎలాంటి వడ్డీ రేట్ల తగ్గింపులు ఉండకపోవచ్చని ఇద్దరు ఫెడ్ అధికారులు వెల్లడించటంతో ఇప్పట్లో రేట్ల తగ్గింపులు ఉండవని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో స్పాట్ మార్కెట్లో రానున్న రోజుల్లో ఔన్సు గోల్డ్ రేటకు 3వేల 150 నుంచి 3వేల 080 డాలర్ల ధర చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వారు చెబుతున్నారు.

ప్రస్తుతం పసిడి ధరలు సైడ్ వేస్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నందున ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో జూన్ మాసానికి 10 గ్రాములకు నేడు రూ.93వేల 530 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. వారంవారీగా ఇది 89వేల 500 నుంచి రూ.95వేల 800 మధ్య కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ పెట్టుబడిదారులు అమ్మకానికి దిగితే 10 గ్రాముల గోల్డ్ రేటు స్పాట్ మార్కెట్లో రూ.91వేల నుంచి 89వేల 500 స్థాయిలకు పడిపోవచ్చని టెక్నికల్స్ ప్రకారం అంచనాలు ఉన్నాయి.