వచ్చేనెల 15 నుంచి ఏపీలో కులగణన.. సీనియర్ ఐఏఎస్​లతో కమిటీ వేశాం: వేణుగోపాలకృష్ణ

వచ్చేనెల 15 నుంచి ఏపీలో కులగణన.. సీనియర్ ఐఏఎస్​లతో కమిటీ వేశాం: వేణుగోపాలకృష్ణ

హైదరాబాద్​, వెలుగు: ఏపీలో వచ్చే నెల 15 నుంచి  కులాలవారీగా జనాభాను లెక్కిస్తామని ఆ రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి, వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ కులగణనను చేపట్టనున్నట్లు చెప్పారు. బుధవారం  అమరావతిలోని ఏపీ సెక్రటేరియెట్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఇప్పటి వరకు జరుగుతున్న జానాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీ జనాభాను తప్ప మిగిలిన వర్గాలను గంపగుత్తగా లెక్కిస్తున్నరని, దీంతో బీసీ ల్లోని అత్యంత వెనకబడిన కులాలు నష్టపోతున్నాయని చెప్పారు. అలాంటి కులాలను గుర్తించి వారి అభ్యున్నతికి అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో కులగణన చేయాలనే డిమాండు ఎప్పటి నుంచో ఉందన్నారు. బీసీ సంఘాల నేతలు, వివిధ వర్గాల ప్రజలు దీనిపై ప్రభుత్వానికి ఎన్నో వినతులు అందజేశారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతీరావ్ ఫూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో కులగణన చేస్తామని ప్రకటించారన్నారు. ఆ మేరకు అన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రత్యేక యాప్ రెడీ

కులగణన కోసం ఇప్పటికే  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గ్రామ, వార్డు సచివాలయ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులతో ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో వచ్చే నెల 15 నుంచి కులగణనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించామన్నారు. బీసీ నేతలు, కుల పెద్దల నుంచి సూచనలు, సలహాల కోసం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఒక ఇ-మెయిల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.