
- రూ.1,100 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగిన అంచనా
- మంత్రి దామోదర రాజనర్సింహకు ఆర్‌అండ్‌బీ అధికారుల వివరణ
- ఖర్చు తగ్గింపుపై టెక్నికల్ కమిటీని నియమించిన ప్రభుత్వం
- దవాఖాన్ల నిర్మాణంపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని ఆర్ అండ్ బీ అధికారులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించారు. తొలుత రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అప్పటి సీఎం కేసీఆర్ డిజైన్లలో చేసిన మార్పులతో ఖర్చు రూ.1,838 కోట్లకు పెరిగిందని చెప్పారు. అవసరం లేకపోయినా ఫ్లోర్ల సంఖ్య పెంచడం, హాస్పిటల్ బిల్డింగ్ ఎలివేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, క్యాంటీన్లు, డైనింగ్ కిచెన్లు వంటివి యాడ్ చేయడంతో అంచనా వ్యయం అదనంగా రూ.738 కోట్లు పెరిగిందని మంత్రికి వివరించారు.
ఈ అదనపు ఖర్చు తగ్గింపుపై మెడికల్ ఎడ్యుకేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి గురువారం సెక్రటేరియెట్‌లో సమావేశం నిర్వహించారు. ఖర్చు తగ్గింపుపై అధ్యయనం చేసి రెండ్రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని టెక్నికల్ కమిటీని మంత్రి ఆదేశించారు. క్యాంటీన్, డైనింగ్ కిచెన్ నిర్మాణాలు ఆపేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తవడం, బిల్డింగ్ పనులు ప్రారంభం కావడంతో ఎలివేషన్ మార్పులు సాధ్యం కావని మంత్రికి ఆర్‌అండ్‌బీ అధికారులు సూచించారు. దీంతో ఖర్చు తగ్గింపునకు ఇంకేం చేయొచ్చో స్టడీ చేయాలని టెక్నికల్ కమిటీకి మంత్రి సూచించారు.
అల్వాల్ టిమ్స్ ఖర్చు రూ.1,376 కోట్లు
టెక్నికల్ కమిటీ సూచన మేరకు అల్వాల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (టిమ్స్) నుంచి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణాన్ని ఆపేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. తొలుత అల్వాల్ టిమ్స్ ను రూ.897 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసే రోజు, ఇక్కడ ఒక ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించాలని కేసీఆర్ అప్పటికప్పుడు అధికారులను ఆదేశించారు.
దీంతో నిర్మాణ ఖర్చు రూ.1,376 కోట్లకు పెరిగింది. హాస్పిటల్‌లో బెడ్ల సంఖ్య 1,000 నుంచి 1,410కి పెరిగింది. దీంతో ఉపయోగం లేదని టెక్నికల్ కమిటీ అభిప్రాయపడినా, అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు బ్లాక్ నిర్మాణానికి ఓకే చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఎంసీహెచ్‌ను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సనత్‌నగర్, కొత్తపేట్ హాస్పిటళ్ల నిర్మాణ పనులపై మంత్రి రివ్యూలో ఆరా తీశారు.
వేగంగా పనులను పూర్తి చేసి, దవాఖాన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిమ్స్‌లో 2వేల బెడ్స్ సామర్థ్యంతో నిర్మిస్తున్న విస్తరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి మెరుగైన వైద్య సేవల కోసం వచ్చే రోగులకు అందించే చికిత్సలపై టెక్నికల్ కమిటీ నియమించాలని హెల్త్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. కమిటీ సూచించిన విధంగా ఆయా హాస్పిటల్స్‌లో స్పెషాలిటీ సేవలను, చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు, డీఎంఈ వాణి, అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.