బెంగళూరు కెఫెలో పేలుడు .. బాంబు పేలుడేనన్న సీఎం

బెంగళూరు కెఫెలో పేలుడు .. బాంబు పేలుడేనన్న సీఎం
  • 9 మందికి గాయాలు
  • విచారణ జరుగుతోందని.. రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కెఫెలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కెఫె సిబ్బందితో పాటు మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందంతో పాటు ఫోరెన్సిక్, బాంబ్  స్క్వాడ్ టీం, పోలీసులు కుందనహళ్లిలోని కెఫెకు చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని బ్రూక్ ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన సమయంలో కస్టమర్ల రద్దీ తక్కువగా ఉండడం, పేలుడు తీవ్రత కూడా తక్కువగానే ఉండడంతో ప్రాణనష్టం తప్పింది.

 తొలుత గ్యాస్ లీక్  కావడంతో పేలుడు జరిగిందని భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాత నిర్ధారించారు. ఓ కస్టమర్ బ్యాగులో పేలుడు పదార్థం తీసుకొచ్చి కెఫెలో వదిలేసి వెళ్లాడని, అదే పేలుడుకు కారణమని తేల్చారు. దీంతో ఆ బ్యాగు తీసుకొచ్చిన కస్టమర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. పేలుడుకు కారణం ఐఈడీగా గుర్తించినట్లు తెలిపారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఈ 
ఘటనను  రాజకీయం చేయొద్దని పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదం జరగలేదు.. పోలీసులు

పేలుడు సంభవించిన తర్వాత ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అది గ్యాస్  సిలిండర్  పేలుడు కాదని చెప్పారు. ‘ప్రాథమిక విచారణలో పేలుడుకు కారణం ఐఈడీ అని తేలింది. ఆధారాలు లభించాక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. గాయపడిన వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని డాక్టర్లు వెల్లడించారు’ అని చెప్పారు.

కెఫె ఓనర్ తో మాట్లాడా.. ఎంపీ తేజస్వీ సూర్య

కుందనహళ్లిలోని రామేశ్వరం కెఫెలో పేలుడు ఘటనకు బాంబు పేలుడే కారణం అనిపిస్తోందంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చెప్పారు. సిటీలో పేలుడు జరిగిందన్న వార్తపై ఆయన ట్విట్టర్​లో స్పందించారు. కెఫె యజమానితో తాను మాట్లాడానని చెప్పారు. ‘ఓ కస్టమర్  వదిలివెళ్లిన బ్యాగ్ వల్ల బ్లాస్ట్  జరిగిందని, సిలిండర్  వల్ల కాదని కెఫే యజమాని చెప్పాడు. గాయపడిన వారిలో తమ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపాడు. అడుగుతున్నారు” అని తేజస్వి ట్వీట్  చేశారు.