- దాడికి అమ్మోనియం నైట్రేట్ వాడకం..డిటొనేటర్ల సహాయంతో పేలుడు
- సూసైడ్ అటాకర్ డాక్టర్ ఉమర్గా గుర్తింపు.. కారు డ్రైవ్ చేస్తూ ఎర్రకోట వద్దకు..
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ట్రేస్ చేసిన అధికారులు
- ఫరీదాబాద్‌లో అనుచరులు పట్టుబడటంతో భయపడిన ఉమర్
- ఫోన్ ఆఫ్ చేసి 3 రోజులు అండర్ గ్రౌండ్.. ఈ క్రమంలోనే ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి
- పుల్వామాలో ఉమర్ ఫ్యామిలీ అరెస్ట్.. విచారణ కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత
న్యూఢిల్లీ:ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనలో డిటోనేటర్లను వాడినట్లు ఫోరెన్సిక్ అధికారులు నిర్ధారించారు. అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ కలిపి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ దాడి వెనుక జైషే మహ్మద్ టెర్రర్ గ్రూప్ హస్తం ఉందని కేంద్ర దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. సూసైడ్ అటాక్‌కు పాల్పడిన వ్యక్తిని పుల్వామాకు చెందిన 33 ఏండ్ల ఉమర్ మహ్మద్‌గా గుర్తించారు.
శ్రీనగర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ (మెడిసన్) పూర్తిచేశాడు. పేలుడుకు కొన్ని గంటల ముందు కారును ఉమర్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని ఇన్వెస్టిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో రెండు రోజుల క్రితం ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన పోలీసులు, ఇద్దరు డాక్టర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వారి వద్ద నుంచి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఆదిల్లను అరెస్టు చేశారు. దీంతో కారు ఓనర్ అయిన డాక్టర్ ఉమర్ మహ్మద్ భయాందోళనకు గురై ఎర్రకోట వద్ద సూసైడ్ అటాక్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే, ఉమర్‌కు అమోనియం నైట్రేట్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
పోలీసుల అదుపులో సూసైడ్ అటాకర్ ఫ్యామిలీ
పుల్వామాకు చెందిన ఉమర్ తండ్రి జీహెచ్ నబీ భట్, తల్లి షమీమా బానో. ఉమర్ తండ్రి గవర్నమెంట్ టీచర్‌గా పని చేశాడు. శ్రీనగర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ (మెడిసన్) పూర్తి చేశాడు. కొన్నేండ్లు జీఎంసీ అనంతనాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా ఉన్నాడు. తర్వాత ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఇటీవల అరెస్టయిన డా.అదిల్‌కు ఉమర్ అత్యంత సన్నిహితుడు.
గతంలో వీరిద్దరూ అనంత్‌నాగ్‌లో కలిసి పని చేశారు. వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్.. ఈ పేలుడుకు పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కోయల్ గ్రామంలోని ఉమర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉమర్ పేరెంట్స్‌తో పాటు అతని ఇద్దరు సోదరులు జహూర్, ఆషిక్ నబీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సూసైడ్ అటాకర్ డీఎన్ఏతో పోల్చుకునేందుకు ఉమర్ తల్లి నుంచి డీఎన్ఏ సేకరించారు. ఉమర్ మహ్మద్ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ సజద్, అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలోని పని చేస్తున్న అతని కొలీగ్స్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఎగ్జామ్స్ ఉన్నాయని ఫోన్ స్విచ్ఛాఫ్
సూసైడ్ అటాక్‌కు ముందు 3 రోజులు ఉమర్ మహ్మద్ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశాక భయపడిన ఉమర్.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి దాక్కున్నాడు. శుక్రవారమే తన తల్లికి ఫోన్ చేసి లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నానని, తనకు ఫోన్ చేయొద్దని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో తన ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. ఉమర్ వదిన ముజామిల్ మాట్లాడుతూ.. ‘‘ఉమర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.
చాలా రిజర్వ్ డ్గా ఉంటాడు. ఫరీదాబాద్‌లోని కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. ఎగ్జామ్స్‌లో బిజీగా ఉన్న అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు. మూడు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పాడు. చివరిసారిగా 2 నెలల కిందట ఇంటికి వచ్చాడు. అతడికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా లేరు’’ అని ఆమె తెలిపింది.
ముగ్గురు డాక్టర్లను విచారిస్తున్న అధికారులు
ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటన కు సంబంధించి ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హర్యానాలోని ఆల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన వాళ్లు. అరెస్టైన వారిలో డాక్టర్లు ముజామిల్ షకీల్, షహీన్ షహీద్, ఉమర్ మహ్మద్ ఉన్నారు. ఇందులో ఉమర్, ముజామిల్ కశ్మీర్‌కు చెందిన వారు కాగా, షహీన్ షహీద్ లక్నోకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా పరిస్థితులపై అమిత్ షా ఆరా
ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. డెడ్‌బాడీలు గుర్తుపట్టేందుకు భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. పేలుడు ధాటికి బాడీ అంతా ఛిద్రం కావడం తో బట్టలు, టాటూల ఆధారంగా తమ వాళ్లను గుర్తుపడుతున్నారు. కాగా, కేంద్ర హోంశాఖ ఈ కేసునుఎన్ఐఏకి అప్పగించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అధికారులతో రెండు సార్లు సమావేశమయ్యారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని తెలిపారు.
3 గంటలు పార్కింగ్‌లోనే..
సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు.. సాయంత్రం 6:22 గంటల వరకు అక్కడే ఉంది. ఆ టైమ్‌లో కారులో మొత్తం ముగ్గురు ఉన్నారు. సుమారు 3 గంటల పాటు అందరూ కారులోనే ఉన్నట్లు తెలుస్తున్నది. అందులోని అనుమానితులు ఒక్కసారి కూడా కిందకు దిగలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్ ఉమర్ కారులో ఆ 3 గంటలు ఏం చేశాడు? వాహనంలోనే ఉండిపోయాడా? ఆ సమయంలో ఎవరినైనా కలిశాడా? అనే కోణాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. పేలుడుకు ముందు.. రోడ్లపై ఎక్కువ రద్దీ ఉండే సమయం కోసం వేచి ఉన్నాడా? అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నారు.
