
- 80 శాతం మందికి నష్టాలే
- పెద్ద సంఖ్యలో జాబ్లాస్లు
న్యూడిల్లీ: అమెరికా విధించిన 25 శాతం అదనపు టారిఫ్ వల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఉద్యోగులను తొలగించడం లేదా యూనిట్లను మూసివేయడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయని భారతీయ వస్త్ర పరిశ్రమ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. 50 శాతం వరకు పెరిగిన టారిఫ్ భారాన్ని మోయలేక అమెరికాకు దుస్తులు సరఫరా చేసే చిన్న భారతీయ ఎగుమతిదారులలో 80 శాతం మంది నష్టాలు చవిచూస్తారని అంచనా వేస్తున్నారు.
పెద్ద కంపెనీలు తమ మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి డిస్కౌంట్లు ఇవ్వడం లేదా ఇతర మార్కెట్ల కోసం ప్రయత్నించక తప్పదని ఎక్స్పర్టులు అంటున్నారు. ఈ విషయమై అపారెల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) ఛైర్మన్ సుధీర్ సెఖ్రీ మాట్లాడుతూ, చిన్న, పెద్ద ఎగుమతిదారులెవరూ ఇంత భారీ సుంకాన్ని భరించలేరని తెలిపారు. చిన్న ఎగుమతిదారుల ఆర్డర్లు రద్దు అవుతున్నాయని, కొత్త ఆర్డర్లు రావడం కూడా తగ్గిపోయిందని చెప్పారు.
మొత్తం ఎగుమతిదారులలో 80 శాతం మంది చిన్న, సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయని, వీళ్లు ఈ నష్టాలను తట్టుకోలేక వ్యాపారాలను మూసివేయాల్సి రావచ్చని ఆయన అన్నారు. అమెరికా కొనుగోలుదారులు భారత్ నుంచి తమ ఆర్డర్లను చైనా లాంటి దేశాలకు తరలించుకోవాలని నిర్ణయించుకున్నారని కూడా సెఖ్రీ చెప్పారు. పెద్ద ఎగుమతిదారులు నాలుగు నెలల వరకు ఈ సంక్షోభాన్ని తట్టుకోగలరని, ఆ తరువాత వారికి కూడా కష్టాలు తప్పవని ఆయన అన్నారు.
ఈ సుంకాల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు అనేక టెక్స్‌టైల్ యూనిట్లు మూతపడతాయని తిరుప్పూర్‌కు చెందిన ఎస్టీ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తిరుకుమరన్ నటరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది టెక్స్‌టైల్ పరిశ్రమకు ఒక విపత్తు అని ఆయన పేర్కొన్నారు.
భారత టెక్స్‌ప్రెనూర్స్ ఫెడరేషన్ కన్వీనర్ ప్రభు ధామోదరన్ మాట్లాడుతూ, ఈ టారిఫ్‌లు 8–-8.5 బిలియన్ డాలర్ల ఎగుమతి ఆధారిత టెక్స్‌టైల్ వ్యాపారానికి ఒక పెద్ద షాక్ అని అన్నారు. దీని ప్రభావం మొత్తం తయారీ రంగాన్ని ప్రభావితం చేస్తుందని, అనేక యూనిట్ల కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.