2047 నాటికి అభివృద్ధి పథంలో : నిర్మలా సీతారామన్

2047 నాటికి అభివృద్ధి పథంలో : నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: నిరుపేదలు, రైతులకు పెద్దపీట వేస్తూ మోదీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ గురువారం ప్రవేశపెట్టింది. వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. టూరిజం, హౌసింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్​లకు బూస్ట్ ఇచ్చేలా ప్రకటనలు చేసింది.

రాబోయే ఐదేండ్లు ఎంతో కీలకం అన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2047 నాటికి దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్​లో జరిగే లోక్​సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెడ్తారు. ఈ మధ్యంతర బడ్జెట్​లో విన్నర్స్.. లూజర్స్ ఎవరో చూసుకుంటే..

విన్నర్స్

అగ్రికల్చర్

వ్యవసాయ రంగంలో ప్రైవేట్, పబ్లిక్ ఇన్వెస్ట్​మెంట్లు పెంచేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నది. మోడ్రన్ స్టోరేజీ సిస్టమ్​తో పాటు సప్లై చైన్​ను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నది. ఆయిల్ సీడ్ పంటల సాగు పెంపునకు బూస్ట్ ఇవ్వాలనుకుంటున్నది. అదేవిధంగా, పాడి రైతుల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు నిర్ణయించింది. వ్యవసాయ రంగ ఉత్పత్తులు పెంచడంతో పాటు మత్స్య సంపద మరిన్ని నిధులు ఖర్చు చేయాలని భావిస్తున్నది.  

మిడిల్ క్లాస్

గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారీ కొనసాగించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా డబ్బులు ఖర్చు చేసేందుకు పన్ను రేట్ల పరిమితిని ప్రభుత్వం పెంచింది. అద్దె ఇండ్లు, మురికివాడలు, అనధికారిక కాలనీల్లో ఉంటున్న మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేరుస్తామని ప్రకటించింది. ఇల్లు కొనేందుకు లేదా కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంతో కేంద్రం ముందుకు వెళ్తున్నది. దేశ ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో కీలకమని భావిస్తున్నది. డెవలప్ అయిన దేశానికి ఇదొక మైలురాయిగా భావిస్తున్నది. 

టూరిజం

దేశంలో టూరిజంను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. ఇండియన్ టూరిజంను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది. టూరిజం డెవలప్​మెంట్ రాష్ట్ర ప్రభుత్వాలపై ఎక్కువ ఆధారపడి ఉండటంతో దీర్ఘ కాలిక వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కూడా ప్లాన్ కేంద్రం చేస్తున్నది. లక్ష్యద్వీప్​తో పాటు ఇతర ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీ పెంచేందుకు నిర్ణయించింది.  

రెన్యూవబుల్ ఎనర్జీ 

విండ్ ఎనర్జీ రంగంలో ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్​ను ప్రకటించినప్పటికీ.. అది అంచనాల కంటే తక్కువే ఉంది. 2070 నాటికి ఇండియాను జీరో కార్బన్ దేశంగా మార్చే యోచనలో కేంద్రం ఉన్నది. దీని కోసం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్​పై ఫోకస్ పెట్టింది. ఈ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ఇవ్వాలనుకుంటున్నది. ఈ స్కీమ్ కోసం నిధులు ఎలా అందిచాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 

లూజర్స్

ఇన్​ఫ్రాస్ట్రక్చర్​

వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఇండియన్ ఎకానమీని 11.1 ట్రిలియన్ రూపాయలకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్న టార్గెట్ కు చేరుకోవాలంటే ఇన్​ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఎంతో కీలకం. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు రూ.11.1 లక్షల కోట్లకు పెంచింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.1 శాతం పెరిగింది. అయితే, క్షీణిస్తున్న మౌలిక సదుపాయాల సవాళ్లను ముందుగా పరిష్కరించాల్సి ఉంది. ఇండియా పెట్టుబడుల్లో మరింత గణనీయమైన పెరుగుదల అవసరం. 

ఎలక్ట్రిక్ వెహికల్స్

పర్యావరణ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగం మరింత విస్తరింపజేసేందుకు కేంద్రం యోచిస్తున్నది. ట్రాన్స్​పోర్ట్ రంగంలో ఈవీ వెహికల్స్​కు ప్రత్యేక స్థానం ఇవ్వాలని భావిస్తున్నది. దీనికి అనుగుణంగా పబ్లిక్ చార్జింగ్ ఇన్​ఫ్రాను అభివృద్ధి చేయాలనుకుంటున్నది. ఎలక్ర్టిక్ పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​​ను పెంచాలని అనుకుంటున్నది. అయితే.. మార్చిలో ముగిసే 1.2 బిలియన్​ల సబ్సిడీ ప్రోగ్రామ్​ను పొడిగించే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

జ్యూవెల్లర్స్

జ్యూవెల్లర్స్​కు మాత్రం మధ్యంతర బడ్జెట్​లో నిరాశే ఎదురైంది. బంగారంపై విధించే ఇంపోర్ట్ ట్యాక్స్ 15 శాతం యథావిధిగా ఉంచింది. దీంతో టైటాన్ గ్రూప్​కు చెందిన టైటాన్​కో, కల్యాణ్ జ్యువెల్లర్స్ ఇండియా లిమిటెడ్, సెన్​కో గోల్డ్ సహా బంగారంతో వ్యాపారం చేసే కంపెనీ షేర్లన్నీ గురువారం పడిపోయాయి. దేశంలో అక్రమంగా బంగారం ఇంపోర్ట్ అవుతున్నదని, దాన్ని తగ్గించాలని జ్యూవెల్లర్స్ ప్రభుత్వాన్ని కోరారు. పన్ను తగ్గిస్తే అక్రమ బంగారం రవాణా అడ్డుకోవచ్చని సూచించారు. అయినా, ఇంపోర్ట్ ట్యాక్స్ మాత్రం తగ్గించలేదు. 

పెట్టుబడుల ఉప సంహరణ

ఈ ఆర్థిక సంవత్సరంలో టికెట్ సేల్స్ భారీగా తగ్గాయి. దీంతో తన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంది. 2024, మార్చి నాటికి రూ.51వేల కోట్లు డిస్​ఇన్వెస్ట్​మెంట్ టార్గెట్ పెట్టుకోగా.. దాన్ని రూ.30వేల కోట్లకు తగ్గించుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని రూ.50వేల కోట్లుగా నిర్ణయించుకుంది.