ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ

ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ
  •  2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్​ ప్లాన్
  • ఇప్పుడున్న ఐదు మాస్టర్ ​ప్లాన్ల స్థానంలో త్వరలో ఒకటే ప్లాన్
  • ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల సన్నాహాలు

హైదరాబాద్, వెలుగు: హెచ్​ఎండీఏ పరిధిని రీజినల్ ​రింగ్ ​రోడ్డు వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ట్రిపుల్ఆర్ పనులు ప్రారంభమైన తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం హెచ్​ఎండీఏ పరిధి 7,285 చ.కి.మీ. కాగా, తాజా నిర్ణయంతో మరో 4 వేల చ.కి.మీ. విస్తరించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రీజనల్ ​రింగ్​ రోడ్డు ​ పూర్తయ్యేలోగా హెచ్​ఎండీఏ పరిధిని పెంచాలని, ఓఆర్​ఆర్​ను దాటి మాస్టర్ ​ప్లాన్​లో మార్పులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 

2050 సంవత్సరం నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ​ప్లాన్ రూపొందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల హెచ్​ఎండీఏ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశాల్లోనూ రీజినల్​ రింగ్ ​రోడ్ ​ప్రాధాన్యం, హెచ్​ఎండీఏ పరిధి పెంపుపై చర్చించినట్లు సమాచారం. ఓఆర్​ఆర్​ నుంచి ట్రిపుల్​ఆర్​ మధ్య ఉన్న ప్రాంతాలను హెచ్​ఎండీఏ కిందికి తీసుకొచ్చి, రెండు రింగ్​ రోడ్లను అనుసంధానం చేస్తూ రేడియల్​ రోడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అధికారులు చెబుతున్నారు.

మెగా మాస్టర్​ ప్లాన్​పై కసరత్తు

రీజనల్ రింగ్ ​రోడ్డు నిర్మాణంతో సిటీతోపాటు తెలంగాణ స్వరూపమే మారిపోనుంది. ముఖ్యంగా రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఓఆర్​ఆర్ ​లోపల అర్బన్​ క్లస్టర్​, ఓఆర్​ఆర్​ తర్వాత ట్రిపుల్ ఆర్ వరకు సెమీ అర్బన్​ క్లస్టర్ గా అభివృద్ధి చేయనున్నారు. ట్రిపుల్ఆర్​అవతలి ప్రాంతాన్ని రూరల్​ క్లస్టర్​గా అభివృద్ధి చేస్తారు. 

ట్రిపుల్​ఆర్​ వరకు హెచ్​ఎండీఏను విస్తరించిన తర్వాత, దానికి తగ్గట్టుగా మాస్టర్​ ప్లాన్​ను రూపొందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం హెచ్​ఎండీఏ పరిధిలో హుడా, హడా, సీడీఏ, జీహెచ్ఎంసీ, ఎక్స్​టెండెడ్​ ఏరియా మాస్టర్ ​ప్లాన్లు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ట్రిపుల్ ఆర్​ వరకు ‘మెగా హెచ్​ఎండీఏ మాస్టర్ ​ప్లాన్​-2050’ను రూపొందించాలని నిర్ణయించారు. ఈ పనులను ప్రభుత్వం హెచ్​ఎండీఏకు అప్పగించింది. 

మెగా మాస్టర్​ప్లాన్​కు సంబంధించిన కార్యక్రమాలను కూడా హెచ్​ఎండీఏనే రూపొందిస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రాంతాలను బట్టి వివిధ కేటగిరీల కింద మార్పు చేయనున్నట్టు సమాచారం. ఇందులో వివిధ జోన్లు ఉండనున్నాయి. 2050 నాటికి  ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలన్న విషయాన్ని మాస్టర్​​ప్లాన్​లో వెల్లడించన్నారు.

 ఇందులో రెసిడెన్షియల్​, కమర్షియల్​, ఇండస్ట్రియల్​, ఐటీ, గ్రీనరీ, ఎంటర్​టెయిన్​మెంట్​ జోన్స్​, అగ్రికల్చర్ ​జోన్​, కన్జర్వేషన్​ జోన్​ఉండనున్నాయి. ఇలా వివిధ అవసరాలకు తగ్గట్టుగా జోన్​లను విభజించి మాస్టర్ ప్లాన్​ రూపొందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.